mudragada: చంద్రబాబును గద్దె దించేంత వరకు కాపులు నిద్రపోవద్దు: అంబటి రాంబాబు

  • చంద్రబాబుకు కాపుల ఓట్లు కావాలి.. వారి సంక్షేమం కాదు
  • మంజునాథ కమిషన్ రిపోర్టును ప్రజల ముందు ఉంచాలి
  • కాపులకు 10 వేల కోట్లు ఇస్తామని జగన్ చెప్పారు

ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాపుల ఓట్లు మాత్రమే ఇష్టమని, వారి సంక్షేమంపై ఎలాంటి ఆసక్తి లేదని వైసీపీ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఓట్ల కోసమే 2014 ఎన్నికల సమయంలో కాపు రిజర్వేషన్ల అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చారని విమర్శించారు. కాపులను బీసీల్లో చేరుస్తామని చెప్పి, మాట తప్పిన మోసగాడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. కాపు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న ముద్రగడకు వైసీపీ మద్దతు ఇచ్చిందని తెలిపారు. కాపు రిజర్వేషన్లపై మంజునాథ కమిషన్ ఇచ్చిన రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా... హడావుడిగా కేంద్రానికి పంపించేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. కమిషన్ రిపోర్టును ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు.

చంద్రబాబుకు మాట తప్పడం, వెన్నుపోటు పొడవడం కొత్త కాదని... కాపు కార్పొరేషన్ కు ఐదేళ్లలో రూ. 5 వేల కోట్లను ఇస్తామని చెప్పి, కేవలం రూ. 1300 కోట్లు మాత్రమే ఇచ్చారని అంబటి మండిపడ్డారు. చంద్రబాబును గద్దె దించేంత వరకు కాపులు నిద్రపోరాదని పిలుపునిచ్చారు. వైసీపీ అధికారంలోకి వస్తే, కాపుల సంక్షేమం కోసం రూ. 10 వేల కోట్లు ఇస్తామని జగన్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కాపు రిజర్వేషన్లపై జగన్ వ్యాఖ్యలను వక్రీకరించారని తెలిపారు. 

More Telugu News