Kanwar Yatra: 20 కిలోల బంగారం, వజ్రాభరణాలతో సర్వసంగ పరిత్యాగి యాత్ర... వెంట భారీ భద్రత!

  • 25వ సారి కన్వార్ యాత్ర చేస్తున్న గోల్డెన్ పూరీ బాబా
  • గత సంవత్సరంతో పోలిస్తే ఐదున్నర కిలోల అదనపు బంగారం
  • వెంట సాయుధులైన పోలీసుల భద్రత

అతను ఐహిక బంధాలను వదిలేసిన సర్వసంగ పరిత్యాగి. అయితేనేం బంగారంపై ఉన్న మక్కువ ఒక్కదాన్నీ వదులుకోలేకపోయాడు. ప్రతి సంవత్సరమూ హరిద్వార్ నుంచి కన్వార్ వరకూ జరిగే సాధువుల యాత్రలో పాల్గొంటాడు. అది కూడా మామూలుగా కాదు. ఆయన ఒంటిపై 20 కిలోల బరువైన బంగారం, వజ్రాభరణాలుంటాయి. ఆయన పేరే గోల్డెన్ పూరీ బాబా అలియాస్ సుధీర్ మక్కర్. ఎన్నో సంవత్సరాలుగా ఈ బాబా బంగారం ఆభరణాలు ధరిస్తూ, ఈ యాత్రలో పాల్గొంటుండగా, ఆయనకు సాయుధులతో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నారు పోలీసులు.

 గతంలో ఇదే యాత్రలో పాల్గొనేందుకు వచ్చిన బాబా ఒంటిపై 12 నుంచి 13 కిలోల ఆభరణాలు ఉండేవి. వీటిల్లో వజ్రాలు సహా విలువైన రాళ్లు కూడా పొదిగివుంటాయి. వీటి విలువే రూ. 4 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. ఇక ఆయన అన్ని వేళ్లకూ ఉంగరాలు, చేతికి రూ. 27 లక్షల రోలెక్స్ వాచ్ నీ ధరించి వుంటాడు. సంవత్సరం గడిచే కొద్దీ ఆయన ఒంటిపై ఉన్న బంగారం బరువు పెరుగుతూ ఉంటుంది. గత సంవత్సరం తన 24వ కన్వార్ యాత్ర చేసిన ఆయన 14.5 కిలోల బంగారం ధరించాడు. ఈ సంవత్సరం 25వ యాత్రకు రూ. 6 కోట్ల విలువైన 20 కిలోల ఆభరణాలతో పాల్గొంటూ అందరినీ ఆకర్షిస్తున్నాడు.

More Telugu News