paruchuri gopalakrishna: గొప్పవాడిని కావాలనే ఆలోచన నాలో కలిగించింది ఘంటసాలగారే: పరుచూరి గోపాలకృష్ణ

  • ఘంటసాల గారి పాటలు బాగా పాడేవాడిని 
  • ఆయన ప్రభావంతో పద్యాలు రాగయుక్తంగా చెప్పేవాడిని
  • ఆయన చనిపోయినప్పుడు అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు

సినీ రచయితగా ఎన్నో ప్రయోగాలు చేసిన పరుచూరి గోపాలకృష్ణ, తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో ఘంటసాల గురించి ప్రస్తావించారు. "ఘంటసాల గారిని తలచుకుంటే గుండె బరువెక్కుతుంది. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తరువాత ఒక ఎన్టీఆర్ గారు .. ఒక కృష్ణగారు .. ఆ తరువాత చిరంజీవిగారు .. బాలకృష్ణగారు .. మోహన్ బాబు గారు .. వీళ్లందరూ కూడా మా ప్రయాణంలో ఒక్కో మెట్టును ఏర్పాటు చేసినవారే. వాళ్లందరినీ జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం.

 కానీ అసలు నేను గొప్పవాడిని కావాలి అనే ఆలోచనను నా మనసులో కలిగించిన మహానుభావుడు ఘంటసాల గారు. అప్పట్లో నేను ఘంటసాల గారి పాటలను బాగా పాడేవాడిని. నేను మాస్టారిగా వున్నప్పుడు ఘంటసాల గారి ప్రభావంతోనే పద్యాలను రాగయుక్తంగా చదివేవాడిని. ఘంటసాల గారు చనిపోయినప్పుడు .. మా కాలేజ్ పిల్లలంతా వెక్కి వెక్కి ఏడ్చేశారు.

ఒక గాయకుడు ఇంతగా జనం హృదయాల్లోకి వెళ్లిపోయాడా? .. ఇంతమందితో అనుబంధాన్ని పెంచుకున్నాడా? అని ఆశ్చర్యం వేసింది. నేను చనిపోయినప్పుడు కూడా ఇలా ఏడ్చే బయటి మనుషులు దొరికితే ఎంత బాగుండును అనే ఆలోచన ఆ రోజున నా బుర్రలోకి వచ్చింది. నేను కూడా గొప్పవాడిని కావాలి .. కావాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాను" అని చెప్పుకొచ్చారు. 

More Telugu News