akula vijaya: కవితకు, సికింద్రాబాదుకు ఏమిటి సంబంధం? జోగిని శ్యామల కన్నీళ్లు మీకు కనిపించలేదా?: కేసీఆర్ పై బీజేపీ ఫైర్

  • భవిష్యవాణి చెప్పిన అమ్మవారే మహిళల దుస్థితిపై మండిపడ్డారు
  • ఏ అర్హతతో కవిత బంగారు బోనం ఎత్తుకున్నారు
  • ఇప్పటికైనా కేసీఆర్ కళ్లు తెరిచి ఆలోచించాలి

తెలంగాణ జనాభాలో సగభాగం ఉన్న మహిళల ఓట్లతో గద్దెనెక్కిన కేసీఆర్... వారి సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదని బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ ప్రశ్నించారు. బంగారు తెలంగాణలో సగభాగం అయిన మహిళలతో కన్నీళ్లు పెట్టిస్తున్న ఘనత కేసీఆర్ దేనని ఆమె మండిపడ్డారు. ఆదివారం నాడు జరిగిన బోనాల వేడుకలో మహిళలు కంటతడి పెట్టారని అన్నారు. మేము మాట్లాడితే రాజకీయాలు అంటారని... భవిష్యవాణి చెప్పిన అమ్మవారే మహిళల భాధలపై మండిపడ్డారని, ఆమె చెప్పిన విషయాలను రాష్ట్రం మొత్తం టీవీలో చూసిందని తెలిపారు.

సికింద్రాబాద్ అమ్మవారికి ప్రభుత్వం బంగారు బోనం సమర్పించినా, మహిళల్లో ఆనందం లేకుండాపోయిందని విజయ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ప్రవర్తించిన తీరుతో జోగిని శ్యామల కన్నీరు పెట్టుకున్నారని తెలిపారు. బంగారు బతుకమ్మతో పాటు, బంగారు బోనం కూడా కేసీఆర్ కూతురు కవితది అయిందని మండిపడ్డారు. రాష్ట్రంలో కవిత తప్ప మరో మహిళ కేసీఆర్ కు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.

 సికింద్రాబాదులో బంగారు బోనంను ఏ అర్హతతో కవిత ఎత్తుకున్నారని నిలదీశారు. కవితకు, సికింద్రాబాదుకు ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. కేసీఆర్ సతీమణి బోనం ఇస్తే తమకు ఎలాంటి అభ్యంతరం ఉండేది కాదని అన్నారు. ప్రభుత్వ తీరుతో భవిష్యవాణి చెప్పే స్వర్ణలత కూడా ఇబ్బంది పడ్డారని తెలిపారు. మహిళా రిపోర్టర్లు, యాంకర్లు కూడా అక్కడ ధర్నా చేయాల్సిన పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు. ఇప్పటికైనా కేసీఆర్ కళ్లు తెరిచి ఆలోచించాలని సూచించారు. 

More Telugu News