kapu reservations: కాపు రిజర్వేషన్లపై కేంద్రం రాజ్యాంగ సవరణ చేస్తుందో లేదో చెప్పాలి!: మంత్రి యనమల

  • రిజర్వేషన్లకు సంబంధించి మేమైతే చట్టం చేసి పంపాం
  • ఈ విషయంలో మేము చేయాల్సింది చేశాం
  • సుప్రీంకోర్టుని, చట్టసభలను కేంద్రం తప్పుదోవ పట్టిస్తోంది

కాపు రిజర్వేషన్లపై కేంద్రం రాజ్యాంగ సవరణ చేస్తుందో లేదో చెప్పాలని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాపు రిజర్వేషన్ల అంశానికి సంబంధించి తామైతే చట్టం చేసి పంపించామని, ఈ విషయంలో తాము చేయాల్సింది అంతా చేశామని చెప్పారు.

కాపు రిజర్వేషన్ల అంశంపై కేంద్రం మాత్రమే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని అన్నారు. ఏపీతో పాటు అనేక రాష్ట్రాల్లో రిజర్వేషన్లపై డిమాండ్లు ఉన్నాయని, అన్ని రాష్ట్రాలు సంయుక్తంగా కృషి చేయాల్సిన అవసరం ఉంటుందని, రిజర్వేషన్లపై కేంద్రం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్ల అంశం తన పరిధిలో లేదనే విషయం వైసీపీ అధినేత జగన్ కు అంతకుముందు తెలియదా? అని ప్రశ్నించారు. ప్రజాసమస్యలపై వైసీపీ, జనసేన పార్టీల అధినేతలు కేంద్రాన్ని నిలదీయాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా విభజన హామీల అమలుకు సంబంధించి సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్లు దాఖలు చేయడాన్ని యనమల తప్పుబట్టారు. సుప్రీంకోర్టుని, చట్టసభలను కేంద్రం తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. విశాఖ రైల్వేజోన్ గురించి కేంద్ర ప్రభుత్వం చెప్పేదొకటి..చేసేదొకటని విమర్శించారు. పదో షెడ్యూల్ లోని సంస్థలపై సుప్రీంకోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నప్పటికీ కేంద్రం అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News