Fakhruddin Ali Ahmed: ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ బంధువులకు పౌరసత్వం నిరాకరణ!

  • ఎన్ఆర్సీ జాబితాలో దక్కని చోటు
  • ఆందోళనలో కుటుంబ సభ్యులు
  • మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని అధికారుల సూచన

అస్సాంలో స్థానికులు, స్థానికేతరుల్ని గుర్తించేందుకు ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన జాతీయ పౌర గుర్తింపు(ఎన్ఆర్సీ) ముసాయిదా అక్కడ అగ్గిని రాజేస్తోంది. దాదాపు 40 లక్షల మంది ప్రజల్ని ఈ ముసాయిదాలో భారత పౌరులుగా గుర్తించకపోవడంతో తమ భవిష్యత్ ఏంటని వారంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ బంధువుల పేర్లు కూడా గల్లంతయినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రభుత్వ వ్యవహార శైలిపై అన్నివర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ విషయమై అలీ సోదరుడి కుమారుడు జియాజుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ.. అన్ని పత్రాలు, ఆధారాలు సమర్పించినా, తమ పేర్లు జాబితాలో చేర్చలేదని మండిపడ్డారు. తొలుత తన కుటుంబ సభ్యుల పేర్లు ముసాయిదా జాబితాలో లేకపోవడంతో ఆశ్చర్యపోయానని జియాజుద్దిన్ తెలిపారు. కానీ ఇప్పుడు తమ భవిష్యత్ ఏంటన్న విషయమై ఆందోళన నెలకొందని వ్యాఖ్యానించారు. కాగా, తాము నిబంధనల మేరకే వ్యవహరించామనీ, జియాజుద్దిన్ మరోసారి సరైన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. 1974 నుంచి 1977 వరకూ 5వ భారత రాష్ట్రపతిగా పనిచేసిన ఫక్రుద్దీన్ అలీ అహ్మద్.. పదవిలో ఉండగానే కన్నుమూశారు.

More Telugu News