Tirumala: టీటీడీ కీలక నిర్ణయం... ఇకపై తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలోనూ బ్రేక్ దర్శనాలు

  • రెండు దఫాలుగా వీఐపీ బ్రేక్ దర్శనం
  • టికెట్ ఖరీదు రూ. 250
  • వెల్లడించిన డిప్యూటీ ఈఓ మునిరత్నం రెడ్డి

ఇకపై తిరుచానూరులోని పద్మావతీ అమ్మవారి ఆలయంలోనూ వీఐపీ బ్రేక్ దర్శనాలను అమలు చేయాలని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ తిరుచానూరులో బ్రేక్ దర్శనాలు లేవు. వీఐపీలు వచ్చినప్పుడు సాధారణ భక్తులను ఆపి, వారిని దర్శనాలకు పంపుతుంటారు. ఈ కారణంతో ఆలయ అధికారులపై విమర్శలు వస్తుండగా, నిర్దేశిత సమయాల్లో బ్రేక్ దర్శనాలను అమలు చేయాలన్న నిర్ణయం తీసుకున్నట్టు డిప్యూటీ ఈఓ మునిరత్నం రెడ్డి తెలిపారు.

బుధవారం నుంచి వీఐపీ బ్రేక్ అమలవుతుందని, ఉదయం 11.30 నుంచి 12 గంటల వరకు, రాత్రి 7 గంటల నుంచి 7.30 గంటల వరకూ సామాన్య భక్తుల క్యూలైన్లను నిలిపి వీఐపీలకు దర్శన సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ ధరను రూ. 250గా నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 4.30 వరకూ యథావిధిగా కుంకుమార్చన ఉంటుందని అన్నారు. రేపటి నుంచి కొన్ని సేవలు, ఆలయ వేళల్లో మార్పులుంటాయని, తెల్లవారుజామున 4.30కి ఆలయాన్ని తెరిచి, రాత్రి 9.30కి మూసేస్తామని తెలిపారు.

More Telugu News