Yanamala: రాజకీయాలపై అవగాహన లేని వ్యక్తుల మాటలకు విలువలేదు: మంత్రి యనమల

  • రిజర్వేషన్లపై జగన్ కు అవగాహన లేదు
  • రాజ్యాంగ పరంగా ఏ నిర్ణయమైనా కేంద్రం తీసుకోవచ్చు
  • రైతులను రెచ్చగొట్టేలా పవన్ వ్యాఖ్యలు ఉన్నాయి

రాజకీయాలపై అవగాహన లేని వ్యక్తుల మాటలకు విలువలేదని, రిజర్వేషన్లపై జగన్ కు అవగాహన లేదని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఈరోజు ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగ పరమైన ఎలాంటి నిర్ణయమైనా కేంద్రం తీసుకోవచ్చని అన్నారు. ఈ సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలపైనా ఆయన మండిపడ్డారు. ఏపీకి అసలు రాజధానే అవసరం లేదన్నట్టుగా పవన్ మాట్లాడుతున్నారని, రైతులను రెచ్చగొట్టేలా పవన్ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని ప్రపంచంలోనే నెంబర్ వన్ రాజధానిగా తీర్చిదిద్దాలని చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు.

హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ, అమరావతికి భూములిచ్చిన రైతులను పవన్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో రైతులకు అన్యాయం జరగలేదని, రాజధానిపై ముందుచూపు లేకుండా మాట్లాడడం సరికాదని అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదాపై ప్రశ్నించాల్సింది చంద్రబాబును కాదు, మోదీని అని అన్నారు.

కాగా, ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళావెంకట్రావు మాట్లాడుతూ, బీసీలకు ఇబ్బంది లేకుండానే కాపు రిజర్వేషన్లు చేయాలని బిల్లు చేసి కేంద్రానికి పంపామని, బీజేపీ డైరెక్షన్ లో జగన్, పవన్ నడుస్తున్నారని విమర్శించారు. కాపు రిజర్వేషన్లపై మోదీని ఒప్పించాలని, కాపులకు అన్యాయం చేసే నైజం జగన్ లో కనిపిస్తోందని, పార్టీ పెట్టి నాలుగేళ్లయినా పవన్ తన విధివిధానాలను ప్రకటించలేదని విమర్శించారు. రాజధాని నిర్మాణం జరగకుండా ఆపేస్తామనే విధంగా పవన్ మాట్లాడటం సబబు కాదని, కాపు రిజర్వేషన్ల అమలుకు కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నామని అన్నారు.

More Telugu News