Bihar: నితీశ్‌ కుమార్ ది 'రాక్షసరాజ్యం' అంటూ మండిపడిన తేజస్వీ!

  • వసతి గృహంలో 34 మందిపై అత్యాచారం
  • తీవ్రంగా స్పందించిన తేజస్వీ యాదవ్
  • నిందితుడికి ప్రభుత్వం రక్షణ కల్పిస్తోందంటూ ఆగ్రహం

ప్రభుత్వ ఆర్ధిక సాయంతో నడుస్తున్న ఓ వసతి గృహంలో 34 మంది బాలికలపై జరిగిన అత్యాచారం ఘటనపై తేజస్వీ యాదవ్ స్పందించారు. వసతి గృహంలోని బాలికలకు మత్తుమందు ఇచ్చి 34 మంది చిన్నారులపై అత్యాచారం చేసి, హింసించిన ఘటన దేశ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కావడంతో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సీబీఐ దర్యాప్తుకు ఆదేశించారు.

ఈ ఘటనపై బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ నితీశ్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడుస్తోందని ఆరోపిస్తూ, ప్రభుత్వాన్ని రావణాసురుడు, దుర్యోధనుడులతో పోల్చారు. బాలికలు నివసించిన గృహంలో డ్రగ్స్, అబార్షన్ పిల్స్ కనిపించాయని, కీలక నిందితుడైన బ్రజేష్ ఠాకూర్‌ను ప్రభుత్వం కాపాడుతోందని ఆరోపించారు. అతడిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలోని మైనర్ బాలికలు అత్యాచారానికి గురైన తర్వాత అతడిని అదుపులోకి తీసుకుంటారా? అని ఫైరయ్యారు.

More Telugu News