Hyderabad: చుక్కేసిన ఐటీ ఉద్యోగినులు... మహిళా పోలీసులు ఏరంటూ చుక్కలు చూపించారు!

  • హైదరాబాద్ లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు
  • వేర్వేరు వాహనాల్లో వచ్చిన ఐదుగురు అమ్మాయిలు
  • ఒకరికి ఒకరు తోడై పోలీసులతో వాగ్వాదం
  • అందరూ తాగి పట్టుబడటంతో కేసులు నమోదు

వారంతా ప్రముఖ ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న అమ్మాయిలు. వారాంతంలో పూటుగా మందు కొట్టి, వాహనాలు నడుపుతూ రోడ్డెక్కారు. ఇంకేముంది, డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న పోలీసుల కంటబడ్డారు. మామూలుగా అయితే, తనిఖీ తరువాత, బీఏసీ శాతాన్ని బట్టి కేసు నమోదవుతుంది. కానీ, ఈ చుక్కేసిన చక్కనమ్మలు మాత్రం పోలీసులకు చుక్కలు చూపించారు. హైదరాబాద్ పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో ఆరు బృందాలు తనిఖీలు చేపట్టగా, రోడ్ నంబర్ 65లో మద్యం మత్తులో ఉన్న అమ్మాయిలు రెచ్చిపోయారు. వారు తాగున్నారని గమనించిన పోలీసులు, తనిఖీలకు ప్రయత్నించగా, మహిళా పోలీసులు ఏరంటూ గొడవకు దిగారు.  

వేర్వేరు వాహనాల్లో వచ్చిన ఐదుగురూ ఒకరికి ఒకరు తోడై, మహిళా పోలీసులు లేకుండా అమ్మాయిలకు శ్వాస పరీక్షలు ఎలా చేస్తారంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో చేసేదేమీ లేక, ఉన్నతాధికారులకు చెప్పి, అప్పటికప్పుడు మహిళా పోలీసులను స్పాట్ కు పిలిపించిన పోలీసులు వారికి తనిఖీలు చేశారు. అందరూ మద్యం తాగినట్టు తేలింది. వారందరిపైనా కేసులు నమోదు చేసిన పోలీసులు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీరికి కౌన్సెలింగ్ నిర్వహించి కోర్టు ముందు హాజరు పరుస్తామని పోలీసు అధికారి ఒకరు చెప్పారు. మొత్తం 62 కార్లు, 64 ద్విచక్ర వాహనాలు పట్టుబడ్డాయని అన్నారు.

More Telugu News