Pakistan: ఇవేం ఎన్నికలు.. మేం ఒప్పుకోం.. మళ్లీ జరిపించండి: పాక్ ప్రతిపక్ష పార్టీల డిమాండ్

  • ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపణ
  • సమావేశమైన ప్రతిపక్ష పార్టీలు
  • దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయం

పాకిస్థాన్‌లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) అతిపెద్ద పార్టీగా అవతరించింది. 116 సీట్లు సాధించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రాకపోవడంతో స్వతంత్రులను, చిన్నపార్టీలను కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఇమ్రాన్ యోచిస్తున్నారు.

ఇమ్రాన్ ప్రభుత్వ ఏర్పాటులో తలమునకలై ఉండగా, ప్రతిపక్ష పార్టీలు ఆయనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నాయి. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తూ మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆల్‌పార్టీ మీట్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు.

జైలులో ఉన్న నవాజ్ షరీఫ్‌కు చెందిన పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) సహా పలు పార్టీలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. ఈ ఎన్నికలను రద్దు చేసి కొత్తగా ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్‌తో దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్నట్టు సమావేశానికి నేతృత్వం వహించిన మౌలానా ఫజలూర్ రెహ్మాన్ తెలిపారు. పీఎంఎల్-ఎన్ నేత, నవాజ్ సోదరుడు షాబాజ్ షరీఫ్ ఇందుకు మద్దతు ప్రకటించారు. అయితే, అధిష్ఠానాన్ని సంప్రదించిన తర్వాత తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు.

More Telugu News