Ys jagan: కాపు రిజర్వేషన్లపై నేను హామీ ఇవ్వలేను: వైఎస్ జగన్

  • కాపు రిజర్వేషన్ల అంశం రాష్ట్ర పరిధిలోనిది కాదు
  • రిజర్వేషన్లు 50% దాటితే కుదరదని ‘సుప్రీం’ చెప్పింది  
  • అధికారంలో కొస్తే ‘కాపు కార్పొరేషన్’కు రెట్టింపు నిధులిస్తాం

కాపు రిజర్వేషన్ల అంశం రాష్ట్ర పరిధిలోనిది కాదని, అందుకే, ఆ అంశంపై తాను హామీ ఇవ్వలేనని  వైసీపీ అధినేత జగన్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, తాను ఏదైనా మాటిస్తే ఆ మాటపై నిలబడే తత్వం తనదని, తాను చేయగలను అనుకుంటేనే చెబుతానని.. చెయ్యలేని వాటి గురించి చెప్పే అలవాటు తనకు లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశాలు కొన్ని, దాని పరిధిలోలేని అంశాలు మరికొన్ని ఉంటాయని, అటువంటిదే రిజర్వేషన్లకు సంబంధించిన సమస్య అని అన్నారు.

 రిజర్వేషన్లు యాభై శాతం దాటకూడదని సుప్రీంకోర్టు చెప్పిందని, ఈ కాపు రిజర్వేషన్ అంశం రాష్ట్ర పరిధిలోది కాదు కనుక, దీనిపై తాను హామీ ఇవ్వలేనని మొహమాటం లేకుండా చెబుతున్నానని అన్నారు. కాపులకు అన్యాయం జరిగిందని మొదట చెప్పింది తానేనని, చంద్రబాబునాయుడి హయాంలో కాపు కార్పొరేషన్ కు ఐదువేల కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి మోసం చేశారని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే కాపు కార్పొరేషన్ కు రెట్టింపు నిధులు ఇస్తామని హామీ ఇస్తున్నానని అన్నారు.

More Telugu News