imran khan: ఇమ్రాన్ ఖాన్ కు మరో 21 మంది అవసరం.. మొదలైన చర్చలు!

  • మ్యాజిక్ ఫిగర్ 137.. ఇమ్రాన్ పార్టీకి వచ్చింది 116
  • చిన్న పార్టీలతో చర్చలు జరుపుతున్న ఇమ్రాన్
  • పీఎంఎల్, పీపీపీలతో జతకట్టబోమన్న ఖాన్

పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ కు చెందిన తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన 137 మ్యాజిక్ ఫిగర్ మాత్రం ఆ పార్టీ చేరుకోలేకపోయింది. 116 సీట్లను మాత్రమే ఆ పార్టీ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో, మ్యాజిక్ ఫిగర్ కు 21 సీట్ల దూరంలో నిలిచిపోయింది. దీంతో, చిన్న పార్టీలతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఇమ్రాన్ ఖాన్ చర్చలు ప్రారంభించారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో పాక్ లోని రెండు కీలక పార్టీలైన పాకిస్థాన్ ముస్లిం లీగ్, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీలతో జతకట్టేందుకు ఇమ్రాన్ మొగ్గు చూపలేదు.

మరోవైపు పోలింగ్ సమయంలో తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ పాక్ సైన్యం సహకారంతో రిగ్గింగ్ కు పాల్పడిందని పీఎంల్ సహా పలు పార్టీలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో, పోలింగ్ కు సంబంధించి ఎలాంటి దర్యాప్తునైనా చేసుకోవచ్చని ఇమ్రాన్ తెలిపారు. పాక్ జాతీయ అసెంబ్లీకి మొత్తం 272 స్థానాలు ఉన్నాయి. వీటిలో 270 స్థానాలకు పాక్ ఎన్నికల కమిషన్ నేడు ఫలితాలను వెల్లడించింది. రెండు స్థానాల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. మరోవైపు, కొన్ని స్థానాలకు సంబంధించి రీకౌంటింగ్ జరుగుతోంది. దీంతో, చివరి ఫలితాలు కొంచెం మారే అవకాశం కూడా ఉంది.

More Telugu News