baba ramdevi: ఇండియాకు కాబోయే ప్రధానమంత్రి బాబా రాందేవ్!: న్యూయార్క్ టైమ్స్ జోస్యం

  • భారత్ లో రాందేవ్ కు తిరుగులేని ఆదరణ ఉంది
  • దేశంలో ఎక్కడకు వెళ్లినా ఆయన పేరు, ముఖం కనపడతాయి 
  • భారత్ లోనే శక్తిమంతమైన ప్రధాని కాగలరు

యోగా గురు బాబా రాందేవ్ గురించి ప్రముఖ అమెరికన్ పత్రిక న్యూయార్క్ టైమ్స్ ఆసక్తికర కథనాన్ని వెలువరించింది. రాందేవ్ సాధించిన విజయాలు, భారత్ లో అతని ప్రభావం గురించి చెబుతూ... రాందేవ్ భారత్ కు కాబోయే ప్రధాని అంటూ పేర్కొంది. ది బిలియనీర్ యోగి బిహైండ్ మోదీస్ రైజ్ (మోదీ ఎదుగుదల వెనుక సంపన్న యోగి) పేరుతో ఈ కథనాన్ని ప్రచురించింది.

ఇప్పటికే అంతర్జాతీయంగా పతాక శీర్షికలకు ఎక్కిన బాబా రాందేవ్... భారత్ తో పాటు విదేశాల దృష్టిని ఆకర్షించడాన్ని కొనసాగిస్తూనే ఉన్నారని చెప్పింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారత సమాధానం రాందేవ్ అని తెలిపింది. తనకు తానుగా ప్రధాని రేసులోకి వెళతాడన్న చర్చ కూడా రాందేవ్ పై జరుగుతోందని పేర్కొంది.

ట్రంప్ తో రాందేవ్ ను పోల్చడంపై మరింత లోతుగా విశ్లేషిస్తూ... ట్రంప్ మాదిరే రాందేవ్ కూడా వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి నేతృత్వం వహిస్తున్నారని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ఇండియాలో రాందేవ్ కు తిరుగులేని ఆదరణ ఉందని... దేశంలోని ప్రతి చోట అతని పేరు, ముఖం కనిపిస్తాయని చెప్పింది. భారత్ లోనే అత్యంత శక్తిమంతమైన ప్రధాని కాగలడని తెలిపింది. ఆధ్యాత్మిక పరంగా కూడా రాందేవ్ కు ఎంతో ప్రాధాన్యత ఉందని పేర్కొంది. ఓ స్థాయి వరకు చట్టం కూడా ఆయనకు సహకరిస్తుందని తెలిపింది. 

More Telugu News