Anantapur District: అనంతపురంలోని స్టేట్ బ్యాంక్ లో రూ. 39 లక్షల దోపిడీ

  • అర్ధరాత్రి బ్యాంకులో ప్రవేశించిన దుండగులు
  • గ్యాస్ కట్టర్ తో స్ట్రాంగ్ రూమ్ లో నగదు లూటీ
  • అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు

అనంతపురంలో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా గ్యాస్ కట్టర్ తో బ్యాంకుకు కన్నం వేసిన దుండగులు రూ. 39 లక్షల నగదును దోచుకెళ్లారు. ఈ రోజు ఉదయాన్నే బ్యాంకును తెరిచిన అధికారులు దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలంలో దొంగలకు సంబంధించి ఎలాంటి వేలి ముద్రలు, ఆనవాళ్లు లభ్యం కాకపోవడంతో ఇది హైటెక్ దొంగల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు.

అనంతపురం టౌన్ లోని జేఎన్టీయూ క్యాంపస్ లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) బ్రాంచ్ వెనుకవైపు కిటికీ ఊచలను కట్ చేసిన దొంగలు బ్యాంకులోకి ప్రవేశించారు. అనంతరం అక్కడ ఉన్నహెచ్చరిక అలారంను, సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు. తమ వెంట తెచ్చుకున్న గ్యాస్ కట్టర్ సాయంతో స్ట్రాంగ్ రూమ్ కు కన్నం వేసి అందినంత దోచుకుని పరారయ్యారు. ఈ రోజు ఉదయాన్నే బ్యాంకు తెరిచిన సిబ్బందికి కిటికీ ఊచలు తెగిఉండటం, స్ట్రాంగ్ రూమ్ తలుపు దెబ్బతిని ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సీసీటీవీ రికార్డులను పరిశీలించిన పోలీసులు శుక్రవారం రాత్రి 2 గంటల సమయంలో ఈ చోరీ జరిగినట్లు గుర్తించారు. దుండగులు బ్యాంకులో ఉన్న రూ. 39,15,000 నగదును దోచుకెళ్లినట్లు తేల్చారు. బ్యాంకులో దొంగలకు సంబంధించి ఎలాంటి వేలిముద్రలు లభ్యం కాకపోవడాన్ని బట్టి హైటెక్ దొంగలే ఈ నేరానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ వెంకట్రావ్ తెలిపారు.

More Telugu News