imran khan: ఇమ్రాన్ ఖాన్ నీది పూల బాట కాదు.. ధైర్యంగా నిర్ణయాలు తీసుకో!: అజారుద్దీన్ సలహా

  • క్రికెట్ కెప్టెన్ కు, దేశ ప్రధానికి చాలా తేడా ఉంది
  • ఇమ్రాన్ ముందు ఎన్నో సమస్యలు ఉన్నాయి
  • టెర్రరిస్టుల చొరబాట్లు ఆగితేనే.. భారత్ చర్చలకు వస్తుంది

పాకిస్థాన్ లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న క్రికెట్ మాజీ కెప్టెన్, తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ కు టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కీలక సలహా ఇచ్చారు. క్రికెట్ కెప్టెన్ గా మైదానంలో ఎన్నో ధైర్యమైన నిర్ణయాలను తీసుకున్నట్టే, దేశ పాలనలో కూడా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. పాక్ జాతీయ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే.

ఇమ్రాన్ తో అజార్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. క్రికెటర్ గా నిప్పులు చెరిగే ఇమ్రాన్ ఖాన్ బంతులను అజారుద్దీన్ ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా అజార్ మాట్లాడుతూ, దేశ ప్రధానిగా ఇమ్రాన్ కు పూల బాట ఉండదని... పాలనలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొవాల్సి ఉంటుందని చెప్పారు. మైదానంలో ఇమ్రాన్ తీసుకున్న ఎన్నో నిర్ణయాలు సత్ఫలితాలను ఇచ్చాయని... కెప్టెన్ గా ఎంతో ధైర్యంతో, ఎన్నో కీలకమైన నిర్ణయాలను ఇమ్రాన్ తీసుకున్నారని తెలిపారు. ఒకవేళ, పాక్ ప్రధానిగా బాధ్యతలను చేపడితే, అదే తరహాలో నిర్ణయాలను తీసుకోవాలని సూచించారు.

క్రికెట్ టీమ్ కు కెప్టెన్ గా వ్యవహరించడం, దేశానికి అధినేతగా ఉండటం రెండూ పూర్తిగా వేర్వేరు అంశాలని అజార్ చెప్పారు. సమస్యలను ఇమ్రాన్ ఎలా చక్కదిద్దుతారో వేచి చూడాలని అన్నారు. ఇండియా-పాకిస్థాన్ ల మధ్య ఉన్న విభేదాలపై అజార్ స్పందిస్తూ... పాక్ ప్రధానిగా ఇమ్రాన్ బాధ్యతలను చేపడితే, ఇరు దేశాల మధ్య ఉన్న శత్రుత్వాన్ని తగ్గించేందుకు యత్నించాలని చెప్పారు. పాక్ లోనే అంతర్గతంగా ఎన్నో సమస్యలు ఉన్నాయని, ఆ సమస్యలను పరిష్కరించేందుకు తొలుత ఆయన కృషి చేయాలని అన్నారు.

ఇరు దేశాల మధ్య చర్చలే కాకుండా, పరిశీలించడానికి ఎన్నో అంశాలున్నాయని అజార్ చెప్పారు. రెండు దేశాల మధ్య శత్రుత్వంతో పాటు, భారత్ లోకి టెర్రరిస్టుల అక్రమ చొరబాట్లు చోటు చేసుకుంటున్న క్రమంలో... ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతాయని తాను భావించడం లేదని అన్నారు. ఉగ్రవాదుల చొరబాట్లను పాక్ ఆపివేయాలని... అప్పుడే చర్చలకు భారత్ మొగ్గు చూపుతుందని తెలిపారు. ఎన్నో అంశాలలో పాకిస్థాన్ తన వ్యవహారశైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. పాక్ ప్రధానిగా ఒక క్రికెటర్ బాధ్యతలను స్వీకరించబోతుండటం చాలా అరుదైన ఘటన అని... ఇది తనకు చాలా సంతోషాన్ని కలిగిస్తోందని అన్నారు.

More Telugu News