Pawan Kalyan: మీ ముగ్గురికీ నేను సవాల్ విసురుతున్నా.. రండి!: పవన్ కల్యాణ్

  • పశ్చిమగోదావరి జిల్లాపై ఓ డిస్కషన్ పెట్టండి
  • మీ ముగ్గురూ ఒకవైపు ఉండండి.. నేనొక్కడినే ఉంటా
  • చంద్రబాబు, లోకేశ్, జగన్ కి నా ఛాలెంజ్  

టీడీపీ, వైసీపీల అవినీతి యనమదుర్రు డ్రెయిన్ ఎలా కంపుకొడుతున్నదో ఆ పార్టీల అవినీతి అలా కంపు కొడుతోందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఒకప్పుడు అన్నపూర్ణగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లా ఈరోజు తాగే నీరు లేక అల్లాడుతోందని అన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబుకు దమ్ముంటే  పంచాయతీ ఎన్నికలు పెట్టాలని పవన్ ఛాలెంజ్ విసిరారు. పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోతామని చెప్పి వాటిని పెట్టేందుకు చంద్రబాబు ఆసక్తి చూపడం లేదని విమర్శించారు. రేపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామని చెప్పి.. ఆ ఎన్నికలు కూడా నిర్వహించరా? అని ప్రశ్నించారు. భీమవరం పట్టణానికి కనీసం ఒక డంపింగ్ యార్డును కూడా ఏర్పాటు చేయలేని టీడీపీ గొప్పలు చెప్పుకుంటోందని మండిపడ్డారు. తాను పబ్లిక్ పాలసీ గురించి మాట్లాడితే తన వ్యక్తిగత జీవితం గురించి జగన్ మాట్లాడుతున్నారని విమర్శించారు.

‘జగన్మోహన్ రెడ్డిగారు, మీరు అసెంబ్లీ నుంచి పారిపోతున్నారు. యనమదుర్రు డ్రెయిన్, తాగునీరు లేకపోవడం, ఆక్వా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడమని జగన్ కు చెబితే..ఆయన నన్ను తిడతారు. మీ వ్యక్తిగత జీవితం గురించి నేను మాట్లాడాలనుకుంటే చాలా మాట్లాడగలను. నేను ప్రజా సమస్యల గురించి మాట్లాడితే నన్నెవరో తప్పుదోవ పట్టిస్తున్నారని చంద్రబాబు, లోకేశ్ లు వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబాబు, లోకేశ్, జగన్మోహన్ రెడ్డి గారికి.. వీళ్ల ముగ్గురికి నేను ఛాలెంజ్ చేస్తున్నా. పశ్చిమగోదావరి జిల్లాపై ఓ డిస్కషన్ పెట్టండి. నేను వస్తాను.. మాట్లాడతాను. ఆ డిస్కషన్ భీమవరంలో జరగాలి. మీ ముగ్గురూ ఒకవైపు ఉండండి.. నేనొక్కడినే ఒకవైపు ఉంటాను’ అన్నారు పవన్ ఆవేశంగా.

More Telugu News