gangster Abu Salem: ‘సంజు’ నిర్మాతలకు మాఫియా డాన్ అబూ సలేం వార్నింగ్

  • సినిమాలో తనపై ఉన్న అభ్యంతరకరమైన సీన్లపై లీగల్ నోటీసులు
  • 15 రోజుల్లోగా తీసేయకుంటే పరువునష్టం దావా వేస్తానని హెచ్చరిక
  • తానెప్పుడూ సంజయ్ ను కలవలేదని స్పష్టీకరణ

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ’సంజు‘ సినిమా నిర్మాతలకు మాఫియా డాన్ అబూ సలేం లీగల్ నోటీసులు పంపించాడు. సినిమాలో తనను తప్పుగా చూపెడుతున్న సీన్లను తొలగించకుంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించాడు. ఈ మేరకు తన న్యాయవాది ప్రశాంత్ పాండే ద్వారా అబూసలేం లీగల్ నోటీసుల్ని పంపాడు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వం వహించిన సంజు జూన్ 29న విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సంజయ్ గా రణ్ బీర్ కపూర్, ఆయన తండ్రిగా పరేశ్ రావల్, సంజయ్ ప్రియురాలిగా సోనమ్ కపూర్ నటించారు.

ముంబై అల్లర్ల సందర్భంగా సంజయ్ దత్ కు తుపాకులు, బుల్లెట్లను అబూసలేం ఇచ్చినట్లు సినిమాలో చూపడంపై ఆయన న్యాయవాది మండిపడ్డారు. సంజయ్ ను అబూసలేం ఇప్పటివరకూ ఒక్కసారి కూడా కలవలేదనీ, అలాంటప్పుడు ఆయుధాలను ఎలా అందిస్తాడని ప్రశాంత్ ప్రశ్నించారు. సలేం పరువుకు నష్టం కలిగించేలా ఉన్న ఈ సీన్లను సినిమా నుంచి 15 రోజుల్లోగా తొలగించకుంటే పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు. 1993లో ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో దోషిగా తేలిన అబూసలేం.. ప్రస్తుతం ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నాడు.

More Telugu News