Hyderabad: రూ. 10 లక్షలు లాభం చూపించి.. హైదరాబాద్ డాక్టర్ నుంచి కోటిన్నర నొక్కేసిన కేటుగాడు!

  • విదేశాల్లో ట్రేడింగ్ అంటూ తొలుత లాభం
  • ఆపై భారీగా డబ్బు నొక్కేసిన సూరత్ వాసి
  • అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకొస్తున్న పోలీసులు

విదేశాల్లో ట్రేడింగ్ చేస్తే వారం రోజుల్లోనే లక్షలు సంపాదించవచ్చని చెప్పి, నకిలీ వెబ్ సైట్ సృష్టించిన కేటుగాళ్లు, హైదరాబాద్ కు చెందిన వైద్యుడికి తొలుత రూ. 10 లక్షలు లాభం చూపించి, ఆపై రూ. 1.50 కోట్లు కొట్టేశారు. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, నగరానికి చెందిన డాక్టర్ దినేశ్ కు వాట్స్ యాప్ లో ఒక ప్రకటన కనిపించింది. తమ సంస్థ ద్వారా ఫారిన్ ట్రేడింగ్ చేస్తే ఎక్కువ డబ్బు సంపాదించుకోవచ్చని చెబుతూ ఓ ఫోన్ నంబర్ ఇచ్చారు.

ఈ ప్రకటనపై ఆకర్షితుడైన దినేష్, సదరు ఫోన్ నంబర్ కు కాల్ చేయగా, తాను ముంబైకి చెందిన అలీ షేక్ నంటూ ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. డబ్బు పెట్టుబడిగా పెడితే, దాని విలువ పెరుగుతుందంటూ నమ్మించాడు. దినేశ్ తొలుత రూ. 50 లక్షలు పెట్టుబడి పెట్టగా, నకిలీ వెబ్ సైట్ సృష్టించి, ఆ డబ్బు ఇన్వెస్ట్ చేసినట్టు, దాని విలువ భారీగా పెరిగినట్టు చూపించాడు. దినేశ్ కు ఓ యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ఇచ్చి అతను కూడా చూసుకునేలా ఏర్పాటు చేశాడు. పెట్టుబడికి వారంలోనే రూ. 10 లక్షలు రావడంతో, ఆ మొత్తం బదిలీ చేయాలని దినేశ్ కోరగా, రూ. 60 లక్షలను దినేశ్ కు పంపించాడు.

దీంతో దినేశ్, అలీని పూర్తిగా నమ్మాడు. తన వలలో దినేశ్ పడిపోయాడని నమ్మిన అలీ, ఓ మారు ఫోన్ చేసి, అంతర్జాతీయ మార్కెట్ భారీ లాభాల్లో ఉందని, మరింత లాభం కావాలంటే, వెంటనే పెట్టుబడి పెట్టాలని చెప్పాడు. దీంతో అత్యాశకు పోయిన డాక్టర్, తన స్నేహితుల నుంచి అప్పు తీసుకుని మరీ రూ. 1.50 కోట్లు ఇన్వెస్ట్ చేశాడు. ఆపై అలీ నుంచి స్పందన రాలేదు.

 దీంతో తాను మోసపోయానని గ్రహించిన దినేశ్, సీసీఎస్ పోలీసులను ఆశ్రయించగా, వారు దర్యాఫ్తు చేశారు. అలీగా చెప్పుకున్న వ్యక్తి అసలు పేరు అమీర్ ఆరిఫ్ అని, అతను సూరత్ వ్యక్తని తేల్చారు. సూరత్ కు వెళ్లిన పోలీసులు, అతన్ని గుర్తించి, అదుపులోకి తీసుకుని ట్రాన్సిట్ వారంట్ పై నగరానికి తీసుకు వస్తున్నారు.

More Telugu News