Telangana: ఇంగ్లిష్ లోని పాఠాలు అర్థం కాక యువకుడి బలవన్మరణం

  • హోటల్ మేనేజ్ మెంట్ విద్యార్థి మురళీకృష్ణ ఆత్మహత్య
  • పాఠాలు అర్థం కావడం లేదని సూసైడ్ నోట్
  • కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు

ఇంగ్లిష్ లో చెబుతున్న పాఠాలు అర్థం కావడం లేదన్న ఆవేదనతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా మునగాల గ్రామానికి చెందిన మురళీకృష్ణ(21) కొన్నిరోజుల క్రితం హైదరాబాద్ లోని ఓ కళాశాలలో హోటల్ మేనేజ్ మెంట్ కోర్సులో చేరాడు. దోమల్ గూడ ప్రాంతంలో రూమ్ తీసుకుని స్నేహితులతో కలసి ఉంటున్నాడు. అయితే చేరిన కోర్సులో పాఠ్యాంశాలన్నీ ఇంగ్లిష్ లో ఉండటంతో డిగ్రీ తెలుగు మీడియంలో చదివిన మురళీకృష్ణ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు.

ఈ నేపథ్యంలో మనస్తాపానికి లోనైన మురళీకృష్ణ  నిన్న రూమ్ లో ఎవ్వరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత గదికి వచ్చిన స్నేహితులు వెంటనే పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఇంగ్లిష్ లో ఉన్న పాఠాలు అర్థం కాకపోవడం వల్లే తాను అత్మహత్య చేసుకుంటున్నట్లు మురళీకృష్ణ తన సూసైడ్ నోట్ లో రాసినట్లు పోలీసులు తెలిపారు. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు. ఒక్కగానొక్క కుమారుడి మృతితో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

More Telugu News