India: దేశ రాజధానిలో ఘోర కలి.. ఆకలితో ముగ్గురు చిన్నారుల మృతి!

  • దేశాన్ని నివ్వెరపరిచిన ఆకలి చావులు
  • 9 రోజులుగా ఆహారం లేక మరణించిన ముగ్గురు చిన్నారులు
  • ఆకలితో అలమటించి ప్రాణాలొదిలిన ఆక్కాచెల్లెళ్లు

దేశాధినేతలు రాష్ట్రపతి, ప్రధాని సహా యంత్రాంగం మొత్తం తిరుగాడే దేశ రాజధానిలో ఘోర కలి సంభవించింది. తినడానికి గుప్పెడు మెతుకులు లేక, ఆకలి బాధతో అలమటించిన ముగ్గురు చిన్నారులు ప్రాణాలొదిలారు. చిన్నారుల పోస్టుమార్టం నివేదికలోనూ విస్తుగొలిపే, సభ్యసమాజం తలదించుకునే విషయాలు వెలుగుచూశాయి. ఆహారం తీసుకోకపోవడంతో బాలికల శరీరంలోని కొవ్వు మొత్తం కరిగిపోయిందన్న విషయం అందరితో కంటతడి పెట్టిస్తోంది. కొవ్వు కూడా కరిగిపోయేంతగా వారు ఆహారం కోసం అలమటించిన తీరు హృదయాలను ద్రవించివేస్తోంది. దేశవ్యాప్తంగా కన్నీరు పెట్టిస్తున్న ఈ ఘటనలో ప్రాణాలొదిలిన అక్కాచెల్లెళ్ల వయసు వరుసగా 8,4,2 ఏళ్లు మాత్రమే కావడం మరో విషాదం.

చిన్నారుల తల్లి మంగళవారం వీరిని స్థానిక ఎల్‌బీఎస్ ఆసుపత్రికి తీసుకొచ్చింది. అప్పటికే వారు చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. అదే రోజు పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు షాక్‌కు గురయ్యారు. 8-9 రోజుల నుంచి వారు ఆహారం తీసుకోలేదని, వారి జీర్ణాశయం, మలద్వారం ఖాళీగా ఉందని వైద్యులు తెలిపారు.

రిక్షా పుల్లర్ అయిన బాలికల తండ్రి జాడ తెలియరాలేదు. మంగళవారం పనికోసం వెళ్లిన అతడు ఇప్పటి వరకు తిరిగి రాకపోవడంతో పోలీసులు గాలిస్తున్నారు. ఆకలి చావుల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో విచారణకు ఆదేశించినట్టు కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ తెలిపారు.

More Telugu News