TTD: టీటీడీ ఉద్యోగుల సమ్మె నోటీసు.. తొలిసారి జేఏసీ ఏర్పాటు!

  • సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు
  • కాంట్రాక్ట్ కార్మికులు కూడా రెడీ
  •  టీటీడీ ఈవోకు సమ్మె నోటీసు అందజేత

తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే తొలిసారి సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగుల జేఏసీ (ఐక్యకార్యచరణ వేదిక) ఏర్పడింది. గురువారం టీటీడీ ఈవో అనిల్ కుమార్  సింఘాల్‌ను కలిసిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సమ్మె నోటీసులు ఇచ్చారు. మరోవైపు కాంట్రాక్ట్ కార్మికులు కూడా సమ్మె నోటీసు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు చర్చించేందుకు నేడు తిరుపతిలో సమావేశం కానున్నారు. సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 16 వరకు గడువు ఇచ్చారు.

ప్రస్తుతం తిరుమలలో శాశ్వత ఉద్యోగులు 8,200 మంది, కాంట్రాక్ట్ ఉద్యోగులు 14,500 మంది ఉన్నారు. ఉద్యోగులపై పనిభారం పెరుగుతుండడం, ప్రాధాన్యం తగ్గుతుండడంతో 2005 నుంచి పలు దఫాలుగా 52 రోజులు ఉద్యమించారు. మళ్లీ ఇప్పుడు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు.

కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీస వేతనం, సెలవులు, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం లేకపోవడం, గతేడాది వైకుంఠ ఏకాదశి సమయంలో ఉద్యోగులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించకపోవడం వంటి అంశాలే సమ్మెకు కారణమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా టీటీడీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యునైటెడ్ ఫ్రంట్‌ నాయకుడు వెంకటేశం మాట్లాడుతూ...  డిప్యుటేషన్లలో హేతుబద్ధత, ప్రత్యేక దర్శనాల్లో కోటా, నగదు రహిత వైద్యం, సర్వీసు నిబంధనలు తదితర డిమాండ్లను సమ్మె నోటీసులో ప్రస్తావించినట్టు తెలిపారు.  

More Telugu News