Chick-fil-A restaurant: రెస్టారెంట్ లో పుట్టిన చిన్నారికి జీవితాంతం ఆహారం ఫ్రీ!

  • అమెరికాలోని  చిక్-ఫిల్-ఏ రెస్టారెంట్ యాజమాన్యం ప్రకటన
  • భవిష్యత్ లో అవసరమైతే ఉద్యోగం కూడా ఇస్తామని హామీ
  • ఉబ్బితబ్బిబ్బవుతున్న బాలిక తల్లిదండ్రులు

అమెరికాలోని ఓ రెస్టారెంట్ లో పుట్టిన చిన్నారి బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఆమెకు జీవితాంతం నచ్చిన ఆహారాన్ని ఉచితంగా అందిస్తామన్న రెస్టారెంట్ యాజమాన్యం.. భవిష్యత్ లో పనిచేయాలనుకుంటే ఉద్యోగం కూడా ఇస్తామని ప్రకటించింది. దీంతో బాలిక తల్లిదండ్రులు తమ కుమార్తె ఎంతో అదృష్టవంతురాలని సంబరపడిపోతున్నారు.


టెక్సాస్ లోని శాన్ ఆంటోనియోలో ఉంటున్న మ్యాగీ గ్రిఫిన్ నెలలు నిండిన గర్భవతి. దాంతో నొప్పులు రావడంతో భర్త రాబర్ట్ తో కలసి ఆస్పత్రికి బయలుదేరింది. మార్గమధ్యంలో తమ కుమార్తెలను ఫ్రెండ్ తో కలసి చిక్-ఫిల్-ఏ రెస్టారెంట్ సమీపంలో దించారు. ఆ తర్వాత తాను రెస్టారెంట్ లోని వాష్ రూమ్ కు వెళ్లివస్తానని మ్యాగీ కారు దిగింది. కానీ నొప్పులు ఒక్కసారిగా ఎక్కువ కావడంతో వాష్ రూమ్ లో పడిపోయింది. ఆమె అరుపులు విన్న భర్త, రెస్టారెంట్ మేనేజర్ అక్కడకు చేరుకుని సపర్యలు చేయడం ప్రారంభించారు. దీంతో మ్యాగీ చివరికి పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. చిన్నారికి తల్లిదండ్రులు మే వయొలెట్ గ్రిఫిన్ గా నామకరణం చేశారు.

ఈ విషయాన్ని రాబర్ట్స్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేయగా.. దాదాపు 3 లక్షల లైక్స్ వచ్చాయి. దీంతో చిక్-ఫిల్-ఏ రెస్టారెంట్ యాజమాన్యం ‘మేం ఆహారాన్నే కాదు.. పిల్లల్ని కూడా డెలివరీ చేస్తాం’ అంటూ రాబర్ట్స్ ఫేస్ బుక్ పోస్ట్ ను షేర్ చేసింది. తమ రెస్టారెంట్ లో పుట్టిన చిన్నారి గ్రిఫిన్ కు జీవితకాలం నచ్చిన ఆహారాన్నిసరఫరా చేస్తామని బంపర్ ఆఫర్ ప్రకటించింది. అంతేకాకుండా పెద్దయ్యాక అవసరమైతే గ్రిఫిన్ కు ఉద్యోగం కూడా ఇస్తామని తెలిపింది. దీంతో తమ కుమార్తె అదృష్ట జాతకురాలని ఆమె తల్లిదండ్రులు మురిసిపోతున్నారు.

More Telugu News