China: బ్రేకింగ్.. బీజింగ్ లోని అమెరికా దౌత్య కార్యాలయం వద్ద పేలుడు!

  • దట్టంగా అలముకున్న పొగ
  • అమెరికా దౌత్య సిబ్బంది సురక్షితం
  • ట్రాఫిక్ ను దారి మళ్లించిన పోలీసులు
  • బాంబు దాడేనని ప్రకటించిన అమెరికా అధికారులు

చైనా రాజధాని బీజింగ్ లోని అమెరికా దౌత్య కార్యాలయం వద్ద కొద్దిసేపటి క్రితం భారీ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో చుట్టుపక్కల ప్రజలంతా భయంతో పరుగులు తీశారు. దౌత్య కార్యాలయం ప్రవేశ ద్వారం వద్ద ఈ పేలుడు సంభవించడంతో భారీ ఎత్తున పొగ అలముకుంది. ఈ ఘటనలో అమెరికాకు చెందిన దౌత్య సిబ్బంది ఎవ్వరికీ గాయాలు కాలేదు. పేలుడు అనంతరం ఈ మార్గంలో ట్రాఫిక్ ను పోలీసులు దారి మళ్లించారు. బాంబు విసిరినట్లు అనుమానిస్తున్న ఓ వ్యక్తి(26)కి ఈ ఘటనలో గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.

ఇటీవల అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ పేలుడు జరగడంతో దీనిని సీరియస్ గా తీసుకుంటున్నారు. తాజా పేలుడుపై వ్యాఖ్యానించేందుకు చైనా ప్రభుత్వ వర్గాలు నిరాకరించాయి. అయితే తమపై బాంబు లాంటి పరికరంతో దాడి జరిగిందని అమెరికా దౌత్య కార్యాలయం తెలిపింది. బీజింగ్ లోని ఈ ప్రాంతంలో అమెరికాతో పాటు ఇజ్రాయెల్, దక్షిణ కొరియా సహా పలు దేశాల దౌత్య కార్యాలయాలు ఉన్నాయి. 

More Telugu News