Rape: కానిస్టేబుల్ చంద్రశేఖర్... హైదరాబాద్ రియల్ హీరో!

  • గత డిసెంబర్ లో అత్యాచారం
  • దాదాపు 7 నెలల తరువాత అదే ప్రాంతంలో నిందితుడు
  • ప్రాణాలకు తెగించి పట్టుకున్న చంద్రశేఖర్
  • 'హీరో ఆఫ్ సిటీ పోలీస్' అన్న సీపీ అంజనీ కుమార్

గడచిన డిసెంబర్ లో జరిగిన రేప్ కేసులో నిందితుడైన జవాను బ్రిజేష్ కుమార్ ను తన ప్రాణాలకు తెగించి పట్టుకున్న కానిస్టేబుల్ చంద్రశేఖర్ ను ఉన్నతాధికారులు రియల్ హీరోగా పొగడుతున్నారు. నిందితుడిని పట్టుకోవడంలో చంద్రశేఖర్ చూపిన ధైర్య సాహసాలు ఎంతో కీలకమని, ఆయన 'హీరో ఆఫ్ సిటీ పోలీస్' అని కొనియాడిన సీపీ అంజనీ కుమార్, ప్రత్యేక రివార్డులు ప్రకటించారు.

గత సంవత్సరం డిసెంబర్ లో ఓ మాజీ సైనికాధికారి కుమార్తెను రేప్ చేయడంతో  పాటు ఆమెతో ఉన్న స్నేహితుడిపై దాడి చేసిన బ్రిజేష్ కుమార్, అప్పటి నుంచి పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు, బాధితురాలి డీఎన్ఏ నమూనాల సాయంతో కేసును విచారిస్తూ, ఘటన జరిగిన అమ్ముగూడ రైల్వే ట్రాక్ పరిసరాల్లో గస్తీని పెంచారు. ఇక గత సోమవారం నాటి రాత్రి రోల్ కాల్ లో భాగంగా చంద్రశేఖర్ (పీసీ 4691) వెళ్లగా, రైల్వే ట్రాక్ సమీపంలో ముగ్గురి మధ్య పెనుగులాట జరుగుతున్న విషయాన్ని గమనించాడు. సమీపంలోని బ్లూ కోల్ట్స్ ను అప్రమత్తం చేస్తూ, నిందితుడు బ్రిజేష్ ను పట్టుకునే ప్రయత్నం చేశాడు.

ఆ సమయంలో చంద్రశేఖర్ పై దాడికి దిగిన బ్రిజేష్, 20 అడుగుల కిందకు దూకి పారిపోయేందుకు ప్రయత్నించగా, చంద్రశేఖర్ వెంబడించాడు. అతన్ని గట్టిగా పట్టుకుని కదలనీయకుండా చేయగా, వారు పెనుగులాడుతున్న సమయంలోనే సమీపంలోని ఇతర పోలీసులు అక్కడకు చేరుకుని బ్రిజేష్ ను అరెస్ట్ చేశారు. ఆపై బాధితురాలు ఒడిశాలో ఉందన్న విషయాన్ని తెలుసుకుని, మసక చీకటిలో బ్రిజేష్ ను నడిపించి, ఆ వీడియోలు ఆమెకు పంపారు. ఆమె నిందితుడు అతనేనని గుర్తించడం, డీఎన్ఏ రిపోర్టు సైతం ఇదే విషయాన్ని నిర్ధారించడంతో బ్రిజేష్ ను కటకటాల వెనక్కు పంపించారు.

తనకు ఓ మహిళ అరుపులు వినిపించాయని, తాను వెళ్లే సరికి ఆమెను పొదల్లోకి లాక్కెళ్లేందుకు నిందితుడు ప్రయత్నిస్తున్నాడని, అడ్డుకోబోతే దాడికి దిగాడని చంద్రశేఖర్ చెప్పాడు. వాహనం డ్రైవర్ హరిరామ్, బ్లూ కోల్ట్స్ కానిస్టేబుల్ నరేంద్రలు తనకు సహకరించారని తెలిపాడు.

More Telugu News