Donald Trump: మాట తప్పుతున్న ఉత్తరకొరియా.. రహస్యంగా అణు ఇంధన శుద్ధి.. అమెరికా ఆరోపణ!

  • అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో వెల్లడి
  • ఉ.కొరియా అణు నిరాయుధీకరణపై వెనక్కి తగ్గబోమని వెల్లడి
  • కిమ్ బృందం గ్యాంగ్ స్టర్ లా డిమాండ్లు చేసిందని మండిపాటు

అణ్వాయుధాల తయారీని నిలిపివేస్తామని ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ మాట ఇచ్చినప్పటికీ.. ఆ దేశం ఇంకా రహస్యంగా అణు ఇంధనాన్ని శుద్ధి చేస్తోందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఇచ్చిన మాటను తుంగలో తొక్కి కిమ్ అణ్వస్ర్త కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళుతున్నారని వెల్లడించారు. అణ్వాయుధాల తయారీలో వాడే యురేనియం-235, ప్లూటోనియం-239, యురేనియం-233, థోరియం-232 వంటి రేడియో ధార్మిక మూలకాలను ఉ.కొరియా శుద్ధి చేస్తోందన్నారు. అమెరికా విదేశీ సంబంధాల కమిటీ ముందు బుధవారం హాజరైన పాంపియో కాంగ్రెస్ సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

ఈ ఏడాది జూన్ 12న సింగపూర్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ తో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అణ్వస్ర్తాలను పూర్తిగా వదులుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కిమ్ ప్రకటించారు. అయితే ఎప్పటిలోగా ఈ ప్రక్రియ పూర్తవుతుందన్న విషయమై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

 ఈ నేపథ్యంలో పాంపియో బుధవారం స్పందిస్తూ.. అణ్వాయుధాలను త్యజించేలా ఉ.కొరియాకు నచ్చజెప్పేందుకు మరికొంత సమయం పడుతుందనీ, అయితే ఈ విషయంలో అమెరికా వెనక్కు తగ్గబోదని స్పష్టం చేశారు. ఈ నెల మొదట్లో తన ఉ.కొరియా పర్యటన సందర్భంగా కిమ్ బృందం గ్యాంగ్ స్టర్ల తరహాలో పలు డిమాండ్లు చేయడంతో సమావేశం అర్థంతరంగా ముగిసిందని పాంపియో కమిటీకి తెలిపారు. అయినప్పటికీ ఈ చర్చల్లో కీలక అంశాల్లో కొంత పురోగతిని సాధించామని పాంపియో పేర్కొన్నారు.

More Telugu News