Donald Trump: ఫ్యాషన్ ప్రపంచానికి గుడ్ బై చెప్పిన ఇవాంకా ట్రంప్!

  • ఫ్యాషన్ బ్రాండ్ నుంచి తప్పుకున్న ఇవాంకా
  • వైట్ హౌస్ పై దృష్టి సారిస్తానని వెల్లడి
  • ఇక వ్యాపారంపై దృష్టిని సారించలేనన్న ఇవాంకా

ఇకపై పూర్తిస్థాయి రాజకీయ నాయకురాలిగా, తన తండ్రికి పాలనలో సహకరించాలని నిర్ణయించుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, తాను నిర్వహిస్తున్న ఫ్యాషన్ బ్రాండ్ ను వదిలేస్తున్నట్టు ప్రకటించారు. 2016 వరకూ ఇవాంకా ట్రంప్ సొంత ఫ్యాషన్ బ్రాండ్ కు ఎంతో పేరుండేది. ఆమె విక్రయించే దుస్తులు, ఫుట్ వేర్, ఇతర యాక్సెసరీస్ అమ్మకాలు బాగానే సాగాయి. తండ్రి అమెరికాకు అధ్యక్షుడైన తరువాత, పలు రిటైల్ చైన్ సంస్థలు ఇవాంకా బ్రాండ్ దుస్తులను విక్రయించడం మానేశాయి. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆమె వ్యాపారం చేస్తున్నారన్న విమర్శలూ వెల్లువెత్తాయి. ప్రస్తుతం ఆమె తండ్రికి సలహాదారుగా వ్యవహరిస్తున్నారు.

"మేము ఈ బ్రాండ్ ను ప్రారంభించినప్పుడు ఇంత విజయవంతం అవుతుందని ఏ మాత్రమూ అనుకోలేదు" అంటోంది ఇవాంకా. "వాషింగ్టన్ లో 17 నెలల పాటు గడిపాను. ఇప్పుడు వ్యాపారంపై దృష్టిని సారించాలని లేదు. భవిష్యత్తుపై దృష్టిని సారించాల్సిన పరిస్థితుల్లో వైట్ హౌస్ లోనే ఉండాలని నిర్ణయించుకున్నాను. నా టీమ్, భాగస్వాముల మేలు కోరి పారదర్శకంగా ఆలోచించిన మీదటే ఈ నిర్ణయం తీసుకున్నాను" అని ఇవాంకా ట్రంప్ ఓ ప్రకటనలో తెలిపారు.

కాగా, అమెరికాలో రిటైల్ చైన్ నిర్వహిస్తున్న నోర్డ్ స్ట్రామ్, నేమన్ మార్కస్ లతో పాటు కెనడా రిటెయిలర్ హడ్సన్ బే తదితరాలు ఇవాంకా బ్రాండ్ విక్రయాలను నిలిపివేశాయి. ఇవాంక తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని, అమెరికా తొలి కుమార్తెగా ఆమె తీసుకున్న నిర్ణయం తమకు బాధ కలిగించేదే అయినా శిరసావహిస్తామని ఇవాంకా ట్రంప్ బ్రాండ్ అధ్యక్షుడు అబిగేల్ క్లెమ్ వెల్లడించారు.

More Telugu News