Taj mahal: తాజ్ మహల్ ను దత్తతకిస్తాం: యూపీ సర్కారు

  • ఈ ప్రాంతాన్ని ’నో ప్లాస్టిక్ జోన్‘ గా ప్రకటిస్తాం
  • సుప్రీంలో దార్శనిక పత్రాన్ని దాఖలు చేసిన యూపీ ప్రభుత్వం
  • 40 చారిత్రక కట్టడాల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి

ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్ ను పరిరక్షించేందుకు కేంద్రం ఇటీవల ప్రారంభించిన దత్తత కార్యక్రమం కింద ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థలకు దాన్ని దత్తత ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించింది. అలాగే తాజ్ తో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాన్ని ’నో ప్లాస్టిక్ జోన్‘గా ప్రటిస్తామని తెలిపింది. తాజ్ మహల్ పరిరక్షణ, కాలుష్య నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంపై సుప్రీం ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజ్ మహల్ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో 250 పేజీల దార్శనిక పత్రాన్ని(విజన్ డాక్యుమెంట్) దాఖలు చేసింది.

తాజ్ మహల్, ఆగ్రా కోట, ఫతేపూర్ సిక్రీ సహా 40 చారిత్రక కట్టడాల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు యూపీ తరఫున అదనపు అడ్వొకేట్ ఐశ్వర్యా భాటి సుప్రీం కోర్టుకు తెలిపారు. ఢిల్లీ స్కూల్  ఆఫ్ ప్లానింగ్ అండ్  ఆర్కిటెక్చర్ రూపొందించిన ఈ దార్శనిక పత్రంపై సంబంధిత ప్రభుత్వ విభాగాలు ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నాయన్నారు. ఈ డాక్యుమెంట్ లోని ప్రణాళికల్ని అమలు చేయడానికి భారీ మొత్తంలో నిధులు కేటాయించాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈ దత్తత కార్యక్రమం కింద దాల్మియా గ్రూప్ కు ఎర్రకోట నిర్వహణను ఇటీవల ఐదేళ్ల పాటు అప్పగించడంపై పలు విమర్శలు వచ్చాయి.

More Telugu News