Pakistan: పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలు.. మొదలైన పోలింగ్!

  • ఓటు హక్కు వినియోగించుకోనున్న 10.6 కోట్ల ప్రజలు
  • 849 సీట్లకు 12,570 మంది అభ్యర్థుల పోటీ
  • షరీఫ్, ఇమ్రాన్ ఖాన్ ల పార్టీల మధ్యే అసలు పోరు 
  • భద్రతకు 8.19 లక్షలమంది ఆర్మీ, పోలీసుల మోహరింపు

పాకిస్తాన్ లో 11వ సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ బుధవారం ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనున్న ఈ పోలింగ్ లో 10.6 కోట్ల మంది పాకిస్తానీలు తమ  ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం ఆ దేశ  ఎన్నికల సంఘం 85,307 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటిలో 12,570 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు.

  సార్వత్రిక  ఎన్నికల్లో భాగంగా పాక్ జాతీయ అసెంబ్లీలోని 272 స్థానాలతో పాటు 577 ప్రావిన్సు సీట్లకు దేశవ్యాప్తంగా 12,570 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పాక్ జాతీయ అసెంబ్లీలో 342 సీట్లు ఉండగా, 60 సీట్లను మహిళలకు,10 సీట్లను మతపరమైన మైనారిటీలకు కేటాయించారు. మిగిలిన 272 సీట్లకు మాత్రమే ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే జాతీయ అసెంబ్లీలో ఏ పార్టీ అయినా 172 సీట్లు సాధించాలి.

ఇమ్రాన్, షరీఫ్ ల మధ్యే హోరాహోరీ 

ఈ ఎన్నికల్లో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నాయకత్వంలోని పాక్ ముస్లిం లీగ్(పీఎంఎల్-ఎన్), మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్, బిలావల్ భుట్టో నాయకత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ప్రధానంగా పోటీ చేస్తున్నాయి. అయితే పాక్ ఆర్మీ మద్దతు పుష్కలంగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ కు, నవాజ్ షరీఫ్ పార్టీకి మధ్యే హోరాహోరీ పోరు జరిగే అవకాశముందని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. పోలింగ్ పూర్తయిన వెంటనే పాకిస్తాన్ లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. పోలింగ్ పూర్తయిన 24 గంటల్లోనే తుది ఫలితాలు వెలువడనున్నాయి.

  16 లక్షల మంది సిబ్బంది నిర్వహణలో..

పాక్ లో సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లకు 16 లక్షల మంది సిబ్బంది సేవల్ని వినియోగించుకుంటున్నట్లు పాక్ ఎన్నికల సంఘం కమిషనర్ సర్దార్ రజాఖాన్ తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో బుధవారం సెలవు దినంగా ప్రకటించామనీ, ప్రజలంతా ఓటింగ్ లో పాల్గొనాలని కోరారు. పోలింగ్ సందర్భంగా భద్రతా ఏర్పాట్ల కోసం 8.19 లక్షల మంది పోలీస్, ఆర్మీ సిబ్బందిని మోహరించినట్లు వెల్లడించారు.

More Telugu News