Rajnath Singh: అవసరమైతే మూకదాడుల నివారణకు ప్రత్యేక చట్టం: రాజ్ నాథ్ సింగ్

  • పార్లమెంటుకు తెలిపిన కేంద్ర హోంమత్రి రాజ్ నాథ్
  • దాడుల నియంత్రణపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని వెల్లడి
  • నిర్లక్ష్యం వహించే అధికారులపై వేటు తప్పదని హెచ్చరిక

దొంగలు, పిల్లల కిడ్నాపర్లు, ఆవుల స్మగ్లర్లు అన్న వదంతులతో దేశవ్యాప్తంగా అమాయకుల్ని కొట్టి చంపుతున్న ఘటనలు పెరిగిపోవడంపై కేంద్రం స్పందించింది. ఇలాంటి మూకహత్యల్ని నివారించేందుకు అవసరమైతే చట్టం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ పార్లమెంటుకు తెలిపారు. ఈ అంశాన్ని తమ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటోందని వెల్లడించారు. మూకహత్యలు వంటి ఘటనల్లో దోషులగా తేలినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటీవల రాజస్తాన్ లోని అల్వార్ లో అక్బర్ అనే వ్యక్తిని దుండగులు కొట్టిచంపిన నేపథ్యంలో రాజ్ నాథ్ ఈ మేరకు స్పందించారు.

నిర్లక్ష్యం వహిస్తే వేటే..

దేశంలో మూకహత్యల నివారణకు కేంద్ర హోంశాఖ అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలను విడుదల చేసింది. మూకదాడులు, అల్లర్లు జరిగిన సందర్భాల్లో విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హోంశాఖ హెచ్చరించింది. మూకహత్యలపై వదంతుల్ని నివారించడానికి ప్రతి జిల్లాకు ఓ ఎస్పీ స్థాయి అధికారిని నియమించాలనీ, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటుచేయడంతో పాటు సోషల్ మీడియాపై నిఘాను కట్టుదిట్టం చేయాలని సూచించింది. దేశంలో మూకహత్యల నియంత్రణకు ప్రత్యేకంగా చట్టం చేయాలని ఇటీవల కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.

More Telugu News