Vijay Malya: భారత్ కు తిరిగివచ్చే ప్రయత్నాలలో మాల్యా.. అధికారులతో చర్చలు?

  • ఈడీ అధికారులతో చర్చలు
  • కేసుల ఎత్తివేతపై ఎలాంటి హామీ ఇవ్వని అధికారులు
  • భారత్ కు రావాలనుకుంటే  ఏర్పాట్లు చేస్తామని వెల్లడి
  • బ్రిటన్ కోర్టులో త్వరలో ముగియనున్న విచారణ

కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అధినేత విజయ్ మాల్యా స్వచ్ఛందంగా భారత్ కు తిరిగి రావాలనుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం మాల్యా ఇప్పటికే భారత అధికారులతో చర్చలు ప్రారంభించినట్లు వెల్లడించాయి. తాను భారత్ కు స్వచ్ఛందంగా తిరిగివస్తానని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులను మాల్యా ఆశ్రయించినప్పటికీ, ఆయనకు ఎలాంటి హామీ లభించలేదని సమాచారం. మాల్యాపై బ్రిటన్ లోని న్యాయస్థానంలో దాఖలైన కేసులో మరికొన్ని వారాల్లోనే తీర్పు రాబోతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. భారతీయ బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.10,000 కోట్ల రుణాలను చెల్లించకుండా మాల్యా 2016లో బ్రిటన్ కు పారిపోయిన సంగతి తెలిసిందే. దీంతో భారతీయ విచారణ సంస్థలు మాల్యాను అప్పగించాలని అక్కడి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.

విమానం దిగగానే అరెస్ట్...

మాల్యా  ఒకవేళ స్వచ్ఛందంగా భారత్ కు వచ్చినా విమానాశ్రయంలో దిగగానే ఆయన్ను అరెస్ట్ చేస్తామని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. భారత్ కు వచ్చినా మాల్యా  ఇక్కడి కోర్టుల్లో న్యాయపోరాటం చేయాల్సిందేనని స్పష్టం చేశారు. అరెస్టయిన తర్వాత 1-2 రోజుల్లోనే మాల్యా బెయిల్ పై జైలు నుంచి విడుదలయ్యే అవకాశముందని వ్యాఖ్యానించారు. భారత్ కు వచ్చేందుకు ఒకవేళ మాల్యా ముందుకొస్తే.. ఎమర్జెన్సీ  ట్రావెల్ డాక్యుమెంట్లను జారీచేస్తామని పేర్కొన్నారు. ఆయనపై ఉన్న క్రిమినల్ నేరాభియోగాలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. మాల్యా వ్యాపారంలో నష్టపోయారా? లేక మోసం చేశారా? అన్నది కోర్టులే తేలుస్తాయన్నారు.

అప్పులు తీర్చేందుకు ఆఫర్..


బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలను చెల్లించేందుకు వీలుగా రూ.13,900 కోట్ల విలువైన తన ఆస్తులను అమ్మేందుకు వీలుగా కర్ణాటక హైకోర్టులో జూన్ 22న మాల్యా పిటిషన్ దాఖలుచేశారు. తాను 2016 నుంచి బ్యాంకులతో సెటిల్మెంట్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నానని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో మాల్యా స్పష్టం చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) సహా 17 బ్యాంకులు కలసి 2010లో మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కు  రూ.10,000 కోట్ల మేర రుణాలిచ్చాయి.

More Telugu News