Andhra Pradesh: లారీల సమ్మెతో తగ్గిన సిమెంట్ సరఫరా.. మందగించిన పోలవరం పనులు

  • లారీల సమ్మెతో మందగించిన ప్రాజెక్టు నిర్మాణ పనులు
  • రోజుకు 50 ట్యాంకర్ల స్థానంలో మూడే
  • నిర్మాణ పనులు ఆగడం లేదన్న నవయుగ

లారీల సమ్మె ప్రభావం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై పడింది. సమ్మె నేపథ్యంలో పోలవరానికి వచ్చే సిమెంటు ట్యాంకర్ల రాక తగ్గింది. దీంతో నిర్మాణ పనులు మందగించినట్టు ‘నవయుగ’ అధికారులు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం రోజూ వివిధ కంపెనీల నుంచి 50 ట్యాంకర్ల ద్వారా సిమెంట్ వచ్చేది. అయితే, లారీల సమ్మె కారణంగా మూడు, నాలుగు ట్యాంకర్లు మాత్రమే వస్తుండడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. స్పిల్‌వే, స్పిల్‌ఛానల్‌లో రోజుకు 1,260 టన్నుల సిమెంటు అవసరమని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం సిమెంటు సరఫరా ఆగిపోవడంతో సిమెంటు కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి పనులకు ఆటంకం లేకుండా చూసుకుంటున్నట్టు చెప్పారు.

స్పిల్ వే నిర్మాణ పనుల్లో భాగంగా 18 లక్షల క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీట్ వేయాల్సి ఉండగా బుధవారం నాటికి 10 లక్షల క్యూబిక్ మీటర్లు పూర్తవుతుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు అయితే కాంక్రీట్ పనులకు ఎటువంటి ఆటంకం ఏర్పడలేదని, కాకపోతే సిమెంటు సరఫరా తగ్గడంతో పనులు కొంత మందగించాయని వివరించారు.  

More Telugu News