James Cameron: జేమ్స్ కేమెరూన్ స్క్రీన్ ప్లేతో వస్తున్న 'అలీటా: ది బ్యాటిల్ ఏంజిల్'!

  • డిసెంబ‌రులో విడుద‌ల కానున్న అలీటా
  • స్క్రీన్ ప్లే అందించిన కెమెరూన్
  • బొమ్మ మాదిరి వుండే నాయిక అలీటా

హాలీవుడ్ సినిమాలకు కొత్త రూపు ఇచ్చిన దర్శకుడిగా జేమ్స్ కేమెరూన్ కి పేరుంది. ఆయన పేరు చెప్పగానే బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలు టైటానిక్, అవ‌తార్ గుర్తుకు వ‌స్తాయి. మ‌రోసారి అలాంటి చ‌రిత్రే సృష్టించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు కేమెరూన్. ఆయ‌న స్క్రీన్ ప్లే అందించిన చిత్రం 'అలీటా: ది బ్యాటిల్ ఏంజిల్' డిసెంబ‌రులో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. రాబ‌ర్ట్ రోడ్రిగే ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో అలీటాగా రోసా సాలాజ‌ర్ నటిస్తున్నారు.

ఈ క్రమంలో ఈ చిత్రం ట్రైల‌ర్ ను ఫాక్స్ స్టార్ ఇండియా సంస్థ తాజాగా విడుద‌ల చేసింది. కథ విషయానికొస్తే, అలీటా అంద‌రిలాంటి అమ్మాయి కాదు. ఉక్కులాంటి శ‌రీరం, బొమ్మ‌లాగా ఉండే ముఖం అలీటాది. ఎంతో కాలం నుంచి నిద్ర‌లోనే ఉన్న ఆమె ఒక్కసారిగా మేల్కొంటుంది. అయ‌తే త‌న గ‌తం ఏమిటో ఆమెకు తెలీదు.

అలాంటి అలీటా గత జీవితంలో ఎన్నో అద్భుతాలు జ‌రిగి ఉంటాయ‌ని ఇడో అనే వైద్యుడు న‌మ్ముతుంటాడు. అత‌ను అలీటాను త‌న‌తో తీసుకువెళ్తాడు. ఇడో ద‌గ్గ‌ర ఉండేట‌ప్పుడే అలీటాకు హ్యూగో అనే వ్య‌క్తి ప‌రిచ‌య‌మ‌వుతాడు. హ్యూగో ఆమెకు పాత జ్ఞాప‌కాలు గుర్తు తెచ్చుకునేందుకు స‌హ‌క‌రిస్తుంటాడు. ఈ క్ర‌మంలో ఓసారి అలీటా ఉన్న ప్రాంతంలోకి కొంద‌రు దుండ‌గ‌లు ప్ర‌వేశించి ఆమె వెంట ప‌డ‌డంతో..అలీటాకు గ‌తం గుర్తొస్తుంది. ఎవ‌రితోనైనా పోరాడే శ‌క్తులు త‌న‌కు ఉన్నాయ‌న్న సంగ‌తి తెలుసుకుంటుంది. ఇక దుండ‌గుల నుంచి అలీటా త‌న‌ను తాను ఎలా ర‌క్షించుకుంద‌న్న‌ది ఆసక్తికరంగా సాగుతుంది. ఫాక్స్ స్టార్ ఇండియా బ్యాన‌ర్ పై కేమెరూన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More Telugu News