Jammu And Kashmir: ఇక్కడ బాగుంది.. భార‌త్ ను వ‌దిలి వెళ్లలేను!: పాక్ ఆక్ర‌మిత కశ్మీర్ బాలుడి అభ్యర్ధన

  • 2017 మే నెల‌లో అష్ఫఖ్ అరెస్ట్
  • భార‌త్ చాలా మంచిదేశం
  • స్వస్థలానికి వెళ్ల‌ను.. ఇక్కడే ఉంటా

పాకిస్థాన్ పౌరులు, పాక్ ఆక్ర‌మిత కశ్మీర్ లోని ప్ర‌జ‌లు భార‌త్ ను నిత్యం ద్వేషిస్తుంటార‌ని అనుకుంటాం. పాక్ పాల‌కుల మాట‌లు కూడా అలాగే ఉంటాయి. ఎప్పుడూ వారు విద్వేష‌పూరిత వ్యాఖ్య‌లే చేస్తుంటారు. త‌మ పౌరులంతా భార‌త్ అంటే మండిప‌డుతుంటార‌ని చెబుతుంటారు. కానీ ఆ మాటల్లో నిజం లేద‌ని ఓ బాలుడు నిరూపించాడు.

పాక్ ఆక్ర‌మిత కశ్మీర్ కు చెందిన అష్ఫ‌ఖ్ అలీ అనే 16 ఏళ్ల బాలుడు త‌న స్వ‌స్థ‌లానికి వెళ్ల‌న‌ని, భార‌త్ లోనే ఉంటాన‌ని వేడుకుంటున్నాడు. అష్ఫ‌ఖ్ అలీ 2017 మే నెల‌లో కశ్మీర్ లోని ర‌జౌరీ జిల్లాలో నియంత్ర‌ణ‌రేఖ వ‌ద్ద అనుమానాస్ప‌దంగా తిరుగుతుండ‌డంతో పోలీసులు ప‌ట్టుకున్నారు. అయితే అష్ఫ‌ఖ్ వ‌ద్ద అనుమానాస్ప‌ద వ‌స్తువులేమీ ల‌భించ‌క‌పోవ‌డంతో అత‌న్ని జ‌మ్మూకశ్మీర్ లోని ర‌ణ్ బీర్ సింగ్ పోరా జిల్లాలోని జువైన‌ల్ హోంకు త‌ర‌లించారు. అయితే, ఈ ఏడాది జ‌న‌వ‌రిలో హోంలోని కిటికీ లోంచి దూకి పారిపోయిన అష్ఫ‌ఖ్ ను ఆ రోజే పోలీసులు పంజాబ్ లోని భ‌టిండా ప్రాంతంలో ప‌ట్టుకున్నారు.

 అప్ప‌టినుంచి హోంలోనే ఉంచిన అష్ఫ ఖ్ ను ఇవాళ విడుద‌ల చేశారు. అయితే ఇప్పుడు తను స్వస్థలానికి వెళ్లేందుకు నిరాక‌రిస్తున్నాడు. గ‌త ఏడాది తాను పొర‌పాటున స‌రిహ‌ద్దు దాటి వ‌చ్చాన‌ని, భార‌త్ లో 14 నెల‌లు ఉన్నాన‌ని, త‌న‌కు భార‌త్ చాలా న‌చ్చింద‌ని, తన ఊరు వెళ్లాల‌ని లేద‌ని పోలీసుల‌తో చెప్పాడు. భార‌త్ మంచి దేశ‌మ‌ని, తాను ఇక్క‌డ హాయిగా ప‌నిచేసుకోగ‌లుగుతున్నాన‌ని, ఇక్క‌డే ఉండి ఏద‌న్నా ఉద్యోగం చేసుకోవాల‌ని ఉంద‌ని, భార‌త ప్ర‌భుత్వం ఇందుకు అనుమ‌తించాల‌ని విజ్ఞ‌ప్తి చేశాడు. అష్ఫ‌ఖ్ కుటుంబీకులు పాక్ ఆక్ర‌మిత కశ్మీర్ లోని దూంగా పెహ్లీ అనే ప్రాంతంలో నివ‌సిస్తున్నారు. మరి, ప్రభుత్వం ఈ విషయంలో ఎలా స్పందిస్తుందో చూడాలి!

More Telugu News