imran khan: ఇమ్రాన్ ఖాన్ కే ప్రజలు పట్టం కడతారా?

  • బుధవారం సార్వత్రిక ఎన్నికలు 
  • ఇమ్రాన్ ఖాన్ పార్టీ ముందంజలో ఉన్నట్టు సర్వేలు 
  • పాక్ లోని పంజాబ్ ఓటర్లే కీలకం

పాకిస్థాన్ లో సార్వత్రిక ఎన్నిక‌ల‌కు స‌ర్వం సిద్ధమైంది. రేపు జరగనున్న పోలింగ్ పై ప్ర‌ధాన పార్టీల నేత‌లు దృష్టి పెట్టారు. మ‌రికొన్ని గంట‌ల్లో ఓట‌ర్లు నేత‌ల భ‌విత‌వ్యాన్ని తేల్చ‌నున్నారు. పాక్ మాజీ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్ కు చెందిన పాకిస్థాన్ ముస్లిం లీగ్ (పీఎంఎల్ ఎన్), ప్ర‌ముఖ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్లీక్ ఎ ఇన్సాఫ్(పీటీఐ), బిలావ‌ల్ భుట్టో నేతృత్వంలోని పీపుల్స్ పార్టీలు అధికారం కోసం పోటీ పడుతున్నాయి.

పాక్ వ్య‌వ‌హారాల్లో కీల‌క పాత్ర పోషించే సైన్యం మ‌ద్ద‌తు పుష్క‌లంగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఈ సారి ఎన్నిక‌ల్లో గెలిచే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు. అయితే జైలులో ఉన్న న‌వాజ్ ష‌రీఫ్ పై ప్ర‌జ‌ల్లో సానుభూతి ఉండ‌డంతో..పీఎంఎల్ ఎన్ కు కూడా బాగానే ఓట్లు ప‌డే అవ‌కాశ‌ముంది. న‌వాజ్ స్థానంలో ఆయ‌న సోద‌రుడు ష‌హ‌బాజ్ ష‌రీఫ్  పీఎంఎల్ ఎన్ కు నేతృత్వం వ‌హిస్తున్నారు.

ఇక  నాయ‌క‌త్వ స‌మ‌స్య‌తో ఇబ్బంది పడుతున్న పీపుల్స్ పార్టీ ఈ సారి అధికారంలోకి వ‌చ్చే సూచ‌న‌లు క‌నిపించ‌డం లేదు. దేశ‌వ్యాప్తంగా నిర్వ‌హించిన ఓ స‌ర్వేలో ఆ పార్టీకి 20 శాతం ఓట్లు వ‌స్తాయ‌ని తేలింది. పీటీఐకి 29 శాతం ఓట్లు, పీఎంఎల్ఎన్ కు 25 శాతం ఓట్లు ల‌భిస్తాయ‌ని స‌ర్వే వెల్ల‌డించింది. పాక్ లోని పంజాబ్ ప్ర‌జ‌ల ఓట్లు ఈ ఎన్నిక‌ల్లో కీల‌క‌మ‌ని భావిస్తున్నారు. ఏ ప‌క్షం వ‌హిస్తారో అర్థం కాని ఓట‌ర్లు పంజాబ్ లో 14 శాతం ఉండ‌గా...ఈ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను వీరే నిర్ణ‌యిస్తార‌ని స‌ర్వే తేల్చింది. ఈ సంగ‌తి ప‌క్క‌న‌పెడితే..సైన్యం మ‌ద్ద‌తిచ్చే పార్టీలే పాక్ ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం ఆన‌వాయితీ. ఆ ప్రకారం చూస్తే ఈ సారి ఇమ్రాన్ గెలిచే అవ‌కాశ‌మే ఎక్కువ‌గా కనిపిస్తోందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

More Telugu News