Rahul Gandhi: నేరాలు జరిగినప్పుడు ఆనందంతో గంతులేయడం మానండి: రాహుల్‌పై బీజేపీ మూకుమ్మడి దాడి

  • ఇది మోదీ దుర్మార్గపు నవ భారతమన్న రాహుల్
  • రాహుల్ ద్వేష బేహారి అన్న పీయూష్ గోయల్
  • రాబందు రాజకీయాలు వద్దన్న స్మృతీ  ఇరానీ

అల్వార్ మూకదాడి (మాబ్ లించింగ్)పై ట్వీట్ చేసిన కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీపై బీజేపీ ట్విట్టర్‌లో మూకుమ్మడి దాడి ప్రారంభించింది. గోవులను అక్రమంగా తరలిస్తున్నాడన్న అనుమానంతో రాజస్థాన్‌లోని అల్వార్‌లో అక్బర్ ఖాన్ అనే వ్యక్తిని కొందరు కొట్టి చంపారు. ఈ ఘటనపై రాహుల్ ట్వీట్ చేస్తూ తీవ్ర గాయాలపాలైన బాధితుడిని ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు పోలీసులకు మూడు గంటలు పట్టిందని పేర్కొన్నారు. ఎందుకంటే మార్గమధ్యంలో వారు టీ తాగారని ఆరోపించారు. ఇది మోదీ ‘దుర్మార్గపు నవభారతం’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక్కడ మానవత్వం స్థానాన్ని ద్వేషం భర్తీ చేస్తోందని ఆరోపించారు.

రాహుల్ ట్వీట్‌పై బీజేపీ ఒక్కసారిగా విరుచుకుపడింది. కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ ట్విట్టర్ వేదికగా రాహుల్‌పై విరుచుకుపడ్డారు. దేశంలో నేరాలు జరిగినప్పుడల్లా రాహుల్ ఆనందంతో గంతులేయడం మానుకోవాలని సూచించారు. కాంగ్రెస్ చీఫ్‌ను ‘ద్వేష బేహారి’గా అభివర్ణించారు. మరో మంత్రి స్మృతీ ఇరానీ ఘాటుగా స్పందించారు. రాహుల్ రాబందు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆయన కుటుంబానికి అటువంటివి అలవాటేనని విమర్శించారు. బీజేపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో అయితే, రాహుల్‌పై ఏకంగా పది లైన్ల పద్యమే ట్వీట్ చేశారు.

More Telugu News