Narendra Modi: మూడు దేశాల పర్యటనకు బయల్దేరిన మోదీ.. రువాండాకు అద్భుతమైన బహుమతులు ఇవ్వనున్న పీఎం

  • రువాండా, ఉగాండా, దక్షిణాఫ్రికా దేశాల పర్యటనకు బయల్దేరిన మోదీ
  • దక్షిణాఫ్రికాలో జరగనున్న బ్రిక్స్ సమావేశంలో పాల్గొననున్న ప్రధాని
  • చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో ప్రత్యేక సమావేశం

భారత ప్రధాని నరేంద్రమోదీ మరో విదేశీ పర్యటనకు బయల్దేరారు. ఐదు రోజుల ఈ పర్యటనలో ఆయన రువాండా, ఉగాండా, దక్షిణాఫ్రికాలలో పర్యటించనున్నారు. తొలుత ఆయన రువాండా వెళుతున్నారు. తన పర్యటన సందర్భంగా రువాండా అధ్యక్షుడు కగామేకు మోదీ 200 ఆవులను బహుమతిగా ఇవ్వనున్నారు. 'గిరింకా' అనే కార్యక్రమం ద్వారా పేదలకు ఆ దేశ ప్రభుత్వం ఒక్కో ఆవును ఇస్తోంది. ఈ ఆవుకు పెయ్య దూడ జన్మిస్తే... దీన్ని పక్కనున్న మరో వ్యక్తికి ఇస్తారు. పేదల ఆర్థిక స్థితిని మెరుగుపరచడమే కాక... ఇరుగుపొరుగువారితో సఖ్యతను పెంచుతుందనే భావనతో ఆ దేశ ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టింది. ఈ పథకం కోసం తమ వంతు సాయంగా మోదీ 200 ఆవులను బహూకరించనున్నారు.

రువాండా పర్యటన ముగించుకుని, రేపు ఉగాండాకు పయనమవనున్నారు మోదీ. గత 21 ఏళ్లలో ఉగాండాలో అడుగుపెడుతున్న తొలి భారత ప్రధాని మోదీనే. రువాండా, ఉగాండాలతో రక్షణ, వ్యవసాయ సంబంధిత ఒప్పందాలను ప్రధాని కుదుర్చుకోనున్నారు. అనంతరం ఉగాండా నుంచి ఆయన దక్షిణాఫ్రికాకు వెళ్తారు. అక్కడ జరగనున్న బ్రిక్స్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో ఆయన ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ ఏడాది వీరిద్దరూ సమావేశం కావడం ఇది మూడోసారి. 

More Telugu News