Mumbai: అమ్మాయిల మోజులో పడి పదే పదే మోసపోయిన బడా వ్యాపారి... పాతిక లక్షలు పోగొట్టుకున్నాక జ్ఞానోదయం!

  • ముంబైలో ఫ్రెండ్ షిప్ క్లబ్ పేరిట మోసం
  • ఫోన్ లో తీయటి మాటలతో పరిచయం పెంచుకునే అమ్మాయిలు
  • ప్లాట్ కు తీసుకెళ్లిన తరువాత నకిలీ పోలీసుల రంగ ప్రవేశం

'ఫ్రెండ్ షిప్ క్లబ్' అంటూ పరిచయం చేసుకుంటున్న అమ్మాయిలు పదే పదే మోసం చేస్తుంటే, వారి మోజులో పడిన ఆ బడా వ్యాపారికి రూ. 25 లక్షలు పోగొట్టుకున్నాకే జ్ఞానోదయం అయింది. ముంబైలో జరిగిన ఈ ఘటనలో పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల మేరకు, నగరంలోని భూలాబాయి దేశాయ్ రోడ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారవేత్తకు ఏప్రిల్ లో ఓ అమ్మాయి ఫోన్ చేసింది. తన పేరు గిమ్మీ అని, ఫ్రెండ్ షిప్ క్లబ్ లో చేరాలని మాయమాటలు చెప్పింది. ఆపై వ్యాపారితో రోజూ మాట్లాడుతూ, పరిచయం పెంచుకుని, అంధేరీ  రైల్వే స్టేషన్ వద్ద కలుద్దామని నమ్మబలికింది. అతన్ని కలిసి, అంబోలీ ప్రాంతంలోని తన ప్లాటుకు తీసుకెళ్లింది.

అప్పటికే అక్కడ ఉన్న మరో ఇద్దరు మహిళలను తన స్నేహితురాళ్లని పరిచయం చేసింది. ఆపై కూల్ డ్రింక్ ఇచ్చి మాటలు చెబుతూ కూర్చుంది. ఈలోగా కాలింగ్ బెల్ కొట్టిన ఇద్దరు, తాము పోలీసులమని చెబుతూ లోపలికి వచ్చారు. ప్లాటులో వ్యభిచారం జరుగుతోందని తమకు తెలిసిందని, కేసు పెట్టి అరెస్ట్ చేస్తామని బెదిరించారు. కేసు వద్దని వ్యాపారి ప్రాధేయపడగా, రూ. 10 లక్షలు డిమాండ్ చేశారు. బేరమాడుకున్న వ్యాపారి రూ. 5 లక్షలు ఇచ్చి తప్పించుకున్నాడు.

కట్ చేస్తే, జూన్ లో అనితా మిస్త్రీ అనే ఓ మహిళ ఫోన్ చేసి, వ్యాపారితో ఫ్రెండ్ షిప్ చేయాలని ఉందని కోరింది. కొద్ది రోజుల ఫోన్ పరిచయం తరువాత, తన ఇంటికి రావాలంటూ ఆహ్వానించింది. దహిసర్ లోని ఇంటికి తీసుకెళ్లింది. అక్కడా ఇద్దరు మహిళలు ఉన్నారు. వారిని పేయింగ్ గెస్టులని పరిచయం చేసింది. బెడ్ రూముకు తీసుకెళ్లి కూల్ డ్రింక్ ఇచ్చింది. ఆపై సేమ్ సీన్ రిపీటైంది. పోలీసులమంటూ ఇద్దరు రాగా, వారికి రూ. 5 లక్షలు సమర్పించుకున్నాడా వ్యాపారి.

ఆపై మరో వారం తరువాత ఏకంగా ఆయన ఇంటికి వెళ్లిన ఈ దొంగ పోలీసులు, వ్యభిచారం రాకెట్ నిర్వహిస్తున్నాడన్న ఆరోపణలపై అరెస్ట్ చేస్తున్నట్టు చెప్పారు. దీంతో భయపడిన ఆ వ్యాపారి రూ. 15 లక్షలు ఇచ్చాడు. డబ్బులు ఇచ్చిన తరువాత అనుమానం వచ్చి పోలీసు స్టేషన్ కు వెళ్లగా, వారు తీగలాగారు. వ్యాపారులను ఎంచుకుని, వారికి అమ్మాయిలతో ఫోన్లు చేయించి వలేసే ముఠాలో వ్యాపారి చిక్కుకున్నాడని తేల్చారు.

ఈ గ్యాంగ్ కు దాలియా సుమస్తీ లీడరని, అయూబ్ రహమాన్ ఖాన్, గణేష్ సోలంకి, రాఘవేంద్ర అటేగిరే అనే వ్యక్తులు, మరో ముగ్గురు మహిళలు ముఠాగా ఏర్పడి ఈ మోసానికి పాల్పడుతున్నారని తేల్చారు. నిందితుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని, వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని వెల్లడించారు.

More Telugu News