Congress: అధికారంలోకొస్తే ఏపీకి ప్రత్యేక హోదా అమలు చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం!

  • ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం
  • ఈ సమావేశం గతానికి, భవిష్యత్తుకు వారధి 
  • ప్రస్తుతం దేశ ప్రజల పరిస్థితి డేంజర్ జోన్ లో ఉంది

వచ్చే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకొస్తే ఏపీకి ప్రత్యేక హోదా అమలు చేయాలని నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం (సీడబ్ల్యూసీ) ఢిల్లీలో జరిగింది. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదాపై కీలక చర్చ జరిగింది. తమ పార్టీ అధికారంలోకొస్తే, ఎటువంటి అడ్డంకులున్నా ఏపీకి ప్రత్యేకహోదా అమలు చేయాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ఈ సమావేశం గతానికి, భవిష్యత్తుకు వారధిగా ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజల గొంతుక వినిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు.

ప్రస్తుతం దేశ ప్రజల పరిస్థితి బాగోలేదని, డేంజర్ జోన్ లో ఉన్నారని, వారిని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటనను అమలు చేయాల్సిన బాధ్యత ఉందని, ఏపీకి ప్రత్యేక హోదాకు, మిగిలిన రాష్ట్రాల డిమాండ్లకు ఏమాత్రం పోలిక లేదని అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని నేతలకు పిలుపు నిచ్చారు.

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ మాట్లాడుతూ, ప్రతిపక్షాలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. డేంజర్ జోన్ లో ఉన్న తమ ప్రజలను కాపాడుకుంటామని, ప్రజాస్వామ్యానికి అర్థం చెబుతామని అన్నారు.  బీజేపీ ఎన్ని కుట్ర పూరిత రాజకీయాలు చేసినా కాంగ్రెస్ పార్టీ వాటిని ప్రేమతో స్వీకరిస్తుందని అన్నారు. కాగా, పార్టీ పొత్తులపై నిర్ణయాధికారాన్ని రాహుల్ కు సీడబ్ల్యూసీ కట్టబెట్టినట్టు సమాచారం.

ఇచ్చిన హామీలను విస్మరించడం బీజేపీకి అలవాటే

బీజేపీపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మండిపడ్డారు. ఇచ్చిన హామీలను విస్మరించడం బీజేపీకి అలవాటేనని ఆయన అన్నారు. తమ పార్టీ గురించి గొప్పలు చెప్పుకోవడం, అమలు కాని హామీలివ్వడం బీజేపీ నేతలకు అలవాటేనని విమర్శించారు. జీఎస్టీ, పెద్దనోట్ల రద్దుతో భారత ఆర్థిక వ్యవస్థను పక్కదారి పట్టించారని మండిపడ్డారు. కొన్ని వస్తువులపై ఉన్న జీఎస్టీ శ్లాబుల్లో మార్పులు చేసింది ప్రజలపై ప్రేమతో కాదని, వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అని విమర్శించారు.

More Telugu News