Telangana: తెలంగాణకు ఉరివేసేలా టీడీపీ అవిశ్వాసం పెడితే ఎలా మద్దతిస్తాం?: టీఆర్ఎస్ ఎంపీ వినోద్

  • తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదు
  • రాష్ట్రానికి నష్టం కలిగించే ఏ నిర్ణయానికీ మద్దతివ్వం  
  • టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ పై మండిపడ్డ వినోద్

తెలంగాణకు ఉరివేసేలా టీడీపీ అవిశ్వాసం పెడితే ఎలా మద్దతిస్తాం? అని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ ప్రశ్నించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ కోసం పుట్టిన పార్టీ తమదని, ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తెలంగాణకు ఏమాత్రం నష్టం కలిగించే నిర్ణయానికైనా తాము మద్దతు ఇవ్వబోమని అన్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపైనా, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపైనా ఆయన విరుచుకుపడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తెలంగాణ గురించి ఏ కాంగ్రెస్ నేత మాట్లాడిన పాపాన పోలేదని, తెలంగాణ కుట్రదారులు ఇప్పుడు తమను విమర్శిస్తున్నారంటూ ఉత్తమ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు అన్యాయం చేసేలా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారని అన్నారు.

అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన పాపం వల్లే ఈ రోజు ఇబ్బందులు ఏర్పడ్డాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొస్తే ఏపీకి పన్ను రాయితీలు ఇస్తామని హామీ ఇచ్చారని, తెలంగాణ శ్రేయస్సు ఆ పార్టీకి అవసరం లేదా? అని ప్రశ్నించారు. లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో టీఆర్ఎస్ తరపున తాను మాట్లాడానని, మోదీ ప్రభుత్వం ఆశించిన రీతిలో పనిచేయలేదని అన్నారు.

More Telugu News