Pawan Kalyan: ఆ విషయం ముందే తెలిసుంటే.. టీడీపీకి మద్దతిచ్చేవాడిని కాదు!: పవన్ కల్యాణ్

  • రాజధాని కోసం అవసరానికి మించి భూసేకరణ చేస్తున్నారు
  • చావులు, ఏడుపులతో రాజధాని వద్దు
  • రైతులను ఏడిపించినవారు సర్వనాశనమైపోతారు

ఏపీ రాజధాని అమరావతి కోసం అవసరానికి మించి భూసేకరణ జరుగుతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. భూసేకరణ చేస్తారనే విషయం ఎన్నికలకు ముందే తెలిసి ఉంటే... తాను మరోలా ఉండేవాడినని, టీడీపీకి మద్దతు ఇచ్చేవాడిని కాదని చెప్పారు. ఇకపై భూసేకరణ చేస్తే, ఎదురు తిరగాలంటూ రైతులకు పిలుపునిచ్చారు. ఈరోజు అమరావతిలోని ఉండవల్లిలో రైతులతో పవన్ భేటీ అయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. భూసేకరణ జరిగితే తనకు చెప్పాలని, తాను కూడా వచ్చి మీతో పాటు ఆందోళనలో పాల్గొంటానని తెలిపారు. భూములను బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నిస్తే... ప్రాణాలు ఇవ్వడానికి తానే ముందుంటానని చెప్పారు.

పంట భూములను బీడు భూములుగా చూపించడం దారుణమని పవన్ మండిపడ్డారు. అవసరానికి మించి భూములను లాక్కుంటే, ముందుండి జనసేన పోరాడుతుందని అన్నారు. అధికారులను, పోలీసులను వ్యతిరేక భావంతో చూడరాదని... వీరంతా ప్రభుత్వ నిర్ణయాలను అమలుచేసే వారు మాత్రమేనని చెప్పారు. చావులు, ఏడుపులతో రాజధాని వద్దని... రైతులను ఏడిపించినవారు నాశనమవుతారని అన్నారు. పంట భూములను లాక్కుంటే సర్వనాశనమైపోతారని శపించారు. భూదాహాలను ప్రభుత్వాలు తగ్గించుకోవాలని అన్నారు. కొంతమంది చేతుల్లోకి మాత్రమే సంపద వెళ్లడాన్ని జనసేన సహించదని అన్నారు. రాజ్యాంగం అందరికీ సమానమేనని... ఎవరూ ఎవరికీ బానిసలు కాదని చెప్పారు. రైతులు వాళ్ల భూముల్లోకి వెళ్లడానికి ఆధార్ కార్డులను చూపించాల్సిన పరిస్థితి రావడం దారుణమని అన్నారు. 

More Telugu News