Pakistan: పాక్‌లో మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీకి కష్టాలు!

  • జర్దారీ మెడకు మనీలాండరింగ్ కేసు
  • జర్దారీ కుమార్తెను కూడా పలాయనవాదిగా పేర్కొన్న ఎఫ్ఐఏ
  • ఎన్నికల తర్వాత దర్యాప్తు

పాకిస్థాన్‌ను ఇప్పుడు కుంభకోణాల కేసులు ఊపేస్తున్నాయి. పనామా పేపర్స్ కుంభకోణంలో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె మరియం నవాజ్‌లు జైలుకు వెళ్లగా, ఇప్పుడు మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీని ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) పరారీలో ఉన్న నిందితుడిగా ప్రకటించింది. ఆయన సోదరి ఫర్యాల్ తల్పూర్‌ను కూడా పలాయనవాదిగా పేర్కొంది. జర్దారీ సన్నిహితుడు అన్వర్ మజీద్ కుమారుడు సహా మరో 20 మందిని కూడా ఈ జాబితాలో చేర్చింది.

రూ.35 బిలియన్ కోట్ల మనీలాండరింగ్ కేసును చీఫ్ జస్టిస్ ఆఫ్ పాకిస్థాన్ (సీజేపీ) జస్టిస్ సాఖిబ్ నిసార్ ఆధ్వర్యంలోని ఇద్దరు సభ్యుల ధర్మాసనం సుమోటోగా స్వీకరించింది.

జూలై 18న జర్దారీ, తల్పూర్ పేర్లను ఎగ్జిట్ కంట్రోల్ లిస్ట్ (ఈసీఎల్) నుంచి పాక్ అంతర్గత మంత్రిత్వ శాఖ తొలగించింది. అంతకుముందు సుప్రీంకోర్టు ఆదేశాలతో వారి పేర్లను ఈసీఎల్ జాబితాలో పేర్లను చేర్చారు.

35 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసులో జర్దారీ, తల్పూర్‌ల హస్తం ఉన్నట్టు భావించిన ఎఫ్ఐఏ ఈనెల 10న వారికి నోటీసులు జారీ చేసింది. తమ ఎదుట హాజరు కావాల్సిందిగా నోటీసులు కూడా జారీ చేసింది. అయితే, ఈ నెల 25న జరగనున్న సార్వత్రిక ఎన్నికల తర్వాత కేసు దర్యాప్తును చేపట్టాల్సిందిగా దర్యాప్తు సంస్థను సుప్రీంకోర్టు ఆదేశించింది.

More Telugu News