Krishna: 2 లక్షల క్యూసెక్కులు దాటిన జూరాల వరద... శరవేగంగా నిండుతున్న శ్రీశైలం!

  • పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ
  • 50 టీఎంసీలను దాటిన నీటి నిల్వ
  • ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద

కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండటంతో శ్రీశైలం జలాశయం శరవేగంగా నిండుతోంది. రెండు రోజుల వ్యవధిలో జూరాల నుంచి 35 టీఎంసీల నీరు దిగువకు విడుదలైంది. గత సంవత్సరం ఇదే సమయానికి శ్రీశైలం రిజర్వాయర్ లో సుమారు 20 టీఎంసీల నీరు మాత్రమే ఉండగా, ఈ సంవత్సరం 50 టీఎంసీలను దాటింది. శనివారం సాయంత్రానికి జూరాల ప్రాజెక్టుకు వస్తున్న వరద 2 లక్షల క్యూసెక్కులను అధిగమించింది.

 ఈ మొత్తం నీటిని విద్యుత్ ఉత్పత్తి, గేట్ల ద్వారా నదిలోకి వదులుతుండటంతో, ఆ నీరంతా శ్రీశైలం జలాశయంలోకి వస్తోంది. మొత్తం 885 అడుగుల మేరకు నీటి నిల్వ సామర్థ్యమున్న జలాశయంలో నిన్న రాత్రి 10 గంటల సమయానికి ప్రస్తుతం 829.20 అడుగులకు నీరు చేరింది. ఈ వరద మరిన్ని రోజులు కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, తుంగభద్ర జలాశయంతో పాటు ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు పూర్తిగా నిండటంతో వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు వదులుతున్నారు.

More Telugu News