mamatha banerjee: మోదీకి 100 సీట్లు కూడా రావు.. దేశానికి మార్గనిర్దేశం చేసేది మేమే!: మమతా బెనర్జీ

  • మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో బీజేపీకి భంగపాటు తప్పదు
  • బీజేపీకి మద్దతుగా ఉన్న అన్నాడీఎంకే భారీ మూల్యం చెల్లించుకుంటుంది
  • 2024 గురించి కాదు.. 2019 గురించి మోదీ ఆలోచించాలి

2019 ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభవం తప్పదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జోస్యం చెప్పారు. మోదీ పార్టీకి 100 పార్లమెంటు స్థానాలు కూడా దక్కవని అన్నారు. కోల్ కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, రానున్న ఎన్నికల తర్వాత దేశానికి మార్గనిర్దేశం చేసేది పశ్చిమబెంగాలేనని చెప్పారు. రాష్ట్రంలోని మొత్తం 42 ఎంపీ స్థానాలను తృణమూల్ కైవసం చేసుకుంటుందని అన్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో కూడా బీజేపీ భారీ ఎత్తున దెబ్బతింటుందని చెప్పారు.

అవిశ్వాస తీర్మానంలో ఎన్డీయే ప్రభుత్వం 325 ఓట్లతో నెగ్గడంపై మమత స్పందిస్తూ... ఈ నంబర్ కేవలం సభ లోపల వరకే పరిమితమని... పార్లమెంటు బయట ఉన్న ప్రజాస్వామ్యంలో బీజేపీ గెలుపొందలేదని చెప్పారు. బీజేపీకి మద్దతు పలుకుతున్న అన్నాడీఎంకే పార్టీ కూడా రానున్న ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకుంటుందని అన్నారు.

ప్రధాని మోదీ 2024 గురించి మాట్లాడుతున్నారని... ముందు 2019 గురించి ఆలోచించాలని మమత ఎద్దేవా చేశారు. ఆగస్ట్ 15న 'బీజేపీని తొలగించండి, దేశాన్ని రక్షించండి' అనే పేరుతో ఓ క్యాంపెయిన్ ను ప్రారంభించనున్నామని చెప్పారు. జనవరి 19న రాష్ట్రంలో ఒక మెగా ర్యాలీని నిర్వహిస్తామని... ఈ ర్యాలీకి దేశంలోని కీలక నేతలంతా హాజరవుతారని తెలిపారు. 

More Telugu News