Chandrababu: మోదీ గారూ.. మీరు పరిపాలించే విధానం ఇదేనా? నమ్మకం అంటే ఇదేనా?: చంద్రబాబు

  • ప్రత్యేక హోదా అనేది కేంద్ర ప్రభుత్వ నిర్ణయమని ఆర్థిక సంఘం స్పష్టంగా చెప్పింది
  • స్పెషల్ స్టేటస్ ఇవ్వకూడదని ఆర్థిక సంఘం మీకు ఎప్పుడు చెప్పింది?
  • మీరు వ్యవహరిస్తున్న తీరు నచ్చకే అవిశ్వాస తీర్మానం పెట్టాం

ఎన్డీయేలో చేరే సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ చెప్పారని... ఆ తర్వాత స్పెషల్ స్టేటస్ ను ఎవరికీ ఇవ్వడం లేదని, హోదాకు సమానమైన ప్యాకేజీని ఇస్తామని చెప్పారని చంద్రబాబు తెలిపారు. ఆ తర్వాత స్పెషల్ ప్యాకేజీని కూడా సరిగా ఇవ్వలేదని మండిపడ్డారు. 14వ ఆర్థిక సంఘం కారణంగా ఏపీకి తాము ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయామని నిన్న లోక్ సభలో ప్రధాని మోదీ చెప్పారని... ఈ సందర్భంగా తాను సూటిగా ఒకటే అడుగుతున్నానని... ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని ఆర్థిక సంఘం ఎప్పుడు చెప్పిందని మోదీని ప్రశ్నించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రత్యేక హోదాకు సంబంధించి 14వ ఆర్థిక సంఘం నిబంధనల్లో ఏమీ లేదని సంఘం సభ్యుడు గోవిందరావు స్పష్టంగా చెప్పారని చంద్రబాబు తెలిపారు. ఆర్థిక సంఘం పేరు చెబుతూ స్పెషల్ స్టేటస్ ఇవ్వలేమని చెప్పడం... ముమ్మాటికీ అందరినీ తప్పుదోవ పట్టించడమేనని మండిపడ్డారు. కావాలనే కేంద్ర ప్రభుత్వం ఏపీకి అన్యాయం జరిగేలా వ్యవహరిస్తోందని చెప్పారు. ప్రత్యేక హోదా అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయమని... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య అనుసంధానకర్తగానే తాము ఉంటామని 14వ ఆర్థిక సంఘం స్పష్టంగా చెప్పిందని తెలిపారు.

నమ్మకం అంటే ఇదేనా? మీరు పరిపాలించే విధానం ఇదేనా? ఇచ్చిన హామీల పట్ల వ్యవహరించే తీరు ఇదేనా? ప్రధానిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలను చక్కదిద్దే విధానం ఇదేనా? అంటూ ప్రశ్నించారు. మీరు వ్యవహరిస్తున్న తీరు నచ్చకే తాము అవిశ్వాస తీర్మానం పెట్టామని చెప్పారు. 

More Telugu News