Air India: ఎయిరిండియా విమానాన్ని కిందికి దించిన నల్లులు.. బాధ భరించలేకపోతున్న ప్రయాణికులు

  • ఎయిరిండియా విమానంలో నల్లులు 
  • ప్రయాణికులపై దాడి
  • శరీరంపై దద్దుర్లతో ప్రయాణికుల బెంబేలు

ముంబై నుంచి నెవార్క్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం బీ777ను నల్లుల కారణంగా విమానాశ్రయానికే పరిమితమైంది. బిజినెస్ క్లాస్ ప్రయాణికులు నల్లుల బాధ భరించలేక విమాన సిబ్బందికి ఫిర్యాదు చేయడంతో విమానాన్ని కిందికి దించక తప్పలేదు. మంగళవారం పోవాయ్‌కు చెందిన కశ్మీరా టోన్‌శేకర్  కుటుంబంతో కలిసి అమెరికా నుంచి వస్తూ ఎయిరిండియా విమానం ఎక్కాడు.

కాసేపటి తర్వాత సీటు కింద నల్లులు ఉన్నాయని, కుడుతున్నాయని ఆయన కుమార్తె చెప్పింది. అయితే, ఆయన పెద్దగా పట్టించుకోలేదు. అయితే, కాసేపటి తర్వాత మరిన్ని నల్లులు సీటుపైకి వచ్చి దాడి చేయడంతో వారు సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దీంతో సీటు కింద సిబ్బంది మందు స్ప్రే చేశారు. వారిని అక్కడి నుంచి ఎకానమీ క్లాస్‌కు పంపించారు. న్యూజెర్సీకి చెందిన వివేక్ మోదీ కూడా నల్లులపై ఫిర్యాదు చేశారు.

గురువారం కూడా ముంబై-నెవార్క్ విమానంలో ఇటువంటి ఘటనే జరిగింది. ఓ చిన్నారిని నల్లులు కుట్టడంతో శరీరంపై దద్దుర్లు వచ్చాయి. దీంతో ఎయిరిండియా విమానాలను గ్రౌండ్‌కే పరిమితం చేశారు. ఒకరోజంతా నల్లుల నిర్మూలన మొదలుపెట్టినట్టు సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. సీట్లు, కవర్లు కొత్తవి అమరుస్తామని చెప్పారు. అయితే, విమానాల షెడ్యూల్‌లో మాత్రం ఎటువంటి మార్పు ఉండబోదన్నారు.

More Telugu News