Chandrababu: చంద్రబాబు గల్లానే ఎందుకు ఎంచుకున్నారంటే..!

  • గల్లా కుటుంబానికి గొప్ప రాజకీయ చరిత్ర
  • తాత స్వాతంత్ర్య సమరయోధుడు
  • చంద్రబాబుకు రాజకీయ గురువు

కేంద్రంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా లోక్‌సభలో చర్చ ప్రారంభమైంది. టీడీపీ తరుపున ఎంపీ గల్లా జయదేవ్ లేచి ప్రసంగానికి సిద్ధమవుతుంటే సభ మొత్తం ఆశ్చర్యపోయింది. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన ఓ వ్యక్తి, తొలిసారి ఎంపీ అయిన గల్లాను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. సభలోని వారే కాదు.. ప్రపంచవ్యాప్తంగా చర్చను టీవీల్లో వీక్షిస్తున్న లక్షలాదిమంది అవాక్కయ్యారు. ఎందుకంటే.. అవిశ్వాస తీర్మానం వంటి కీలకమైన చర్చల్లో ఏ పార్టీ అయినా సీనియర్‌కు బాధ్యతలు అప్పగిస్తుంది. అయితే, టీడీపీ మాత్రం తొలిసారి ఎంపీ అయిన వ్యక్తికి ఆ బాధ్యతలు అప్పగించడం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడడం, అమెరికా యాసపై పట్టుండడంతో జయదేవ్ అదరగొట్టారు.

ఏపీ రాజకీయ విశ్లేషకుల ప్రకారం.. గల్లా అంత గట్టివాడేం కాదు. అయితే, పార్లమెంటులో అటాక్‌కు చంద్రబాబు.. గల్లాను ఎంచుకోవడం మాత్రం వారిని ఆశ్చర్యపరచలేదు. గుంటూరు ఎంపీ అయిన గల్లాకు రాజకీయంగా ఇదే తొలి అడుగు అయినా ఆయన కుటుంబం మొత్తానికి ఘనమైన రాజకీయ చరిత్ర ఉంది.

గల్లా  తాత పాతూరి రాజగోపాలనాయుడు (రాజన్న) స్వాతంత్ర్య సమరయోధుడు. ముఖ్యంగా చంద్రబాబుకు రాజకీయ గురువు. రాజగోపాల్ రెండుసార్లు ఎంపీ అయ్యారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా స్వతంత్ర పార్టీని స్థాపించడంలో రాజన్న కీలక పాత్ర పోషించారు. ఆయన కుమార్తె గల్లా అరుణకుమారి చంద్రగిరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పలుమార్లు మంత్రిగానూ పనిచేశారు.

ఇక, చంద్రబాబు రాజకీయంగా ఎదగడానికి రాజన్న సాయం చేశారు. చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన చంద్రబాబు అంజయ్య ప్రభుత్వంలో మంత్రిగానూ పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరారు. పార్టీలోని సీనియర్ ఎంపీలను కాదని చంద్రబాబు గల్లాకు బాధ్యతలు అప్పగించడం వెనక బలమైన కారణం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మర్యాదస్తుడు, ఉన్నత విద్యావంతుడు అయిన గల్లా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని దేశం ముందుకు సరిగ్గా తీసుకెళ్లగరని చంద్రబాబు భావించారు. దీనికి తోడు ఆయనకు ఆంగ్లంపై మంచి పట్టుండడం, ఏ విషయాన్నైనా ధైర్యంగా, సూటిగా చెప్పలగలగడం వంటి కారణాల వల్లే ముఖ్యమంత్రి ఆయనకు బాధ్యతలు అప్పగించినట్టు చెబుతున్నారు. చంద్రబాబు అప్పగించిన బాధ్యతలను గల్లా సక్రమంగా నిర్వర్తించారని, తనపై పెట్టుకున్న విశ్వాసాన్ని నిలుపుకున్నారని విశ్లేషిస్తున్నారు.

More Telugu News