Special Category Status: ప్యాకేజీ చాలనే హక్కు చంద్రబాబుకు ఎవరిచ్చారండీ?: జగన్ నిప్పులు

  • ప్రత్యేక ప్యాకేజీ చాలని స్వప్రయోజనాలు చూసుకున్న చంద్రబాబు
  • హోదా వచ్చుంటే నిరుద్యోగులకు ఉపాధి లభించేది
  • మోదీ, రాహుల్ ప్రసంగాలతో బాధ కలిగిందన్న జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ చాలనే హక్కు చంద్రబాబునాయుడికి ఎవరిచ్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఈ ఉదయం కాకినాడ సమీపంలో మీడియాతో మాట్లాడిన ఆయన, చంద్రబాబు అంగీకరించిన మీదటే ప్యాకేజీని ప్రకటించినట్టు నిన్న లోక్ సభలో మోదీ మాట్లాడిన విషయాలను గుర్తు చేశారు.

హోదాయే కావాలని తొలి రోజు నుంచి పట్టుబట్టింది ఒక్క వైకాపా పార్టీయేనని అన్నారు. హోదా వస్తే, పరిశ్రమలు వచ్చి నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని, కానీ, తన స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు ప్యాకేజీ వైపు మొగ్గుచూపి రాష్ట్రానికి అన్యాయం చేశారని నిప్పులు చెరిగారు. హోదా వస్తే హోటళ్లు, ఫ్యాక్టరీలు, ఆసుపత్రులు కట్టేవాళ్లు ఎంతో ఉత్సాహంతో రాష్ట్రానికి వచ్చుండేవారని, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన రోజే నిలదీసుంటే హోదా వచ్చేదని, కానీ ఆయన రాజీ పడ్డారని విమర్శించారు.

ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కులను తాకట్టు పెట్టే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎవరిచ్చారని జగన్ ప్రశ్నించారు. నిన్న మోదీ మాట్లాడిన మాటలు తనకు బాధను కలిగించాయని, కాంగ్రెస్ కు చెందిన రాహుల్ గాంధీ కూడా తన ప్రసంగంలో అర నిమిషమైనా ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడలేదని విమర్శించారు. ప్రత్యేక హోదాను తాము ఇస్తామని చెప్పామని, మీరు ఎందుకివ్వరన్న ప్రశ్నను ఆయన అడగలేదని గుర్తు చేశారు. సభలో చర్చ జరుగుతున్న సమయంలో, ఆ తరువాత చంద్రబాబు ప్రవర్తించిన తీరు ప్రజలకు మరింత బాధను కలిగించిందని జగన్ వ్యాఖ్యానించారు.

More Telugu News