Chandrababu: వైసీపీ ట్రాప్ లో పడ్డామంటారా? ఇంతకన్నా అవాస్తవం మరొకటి ఉందా?: చంద్రబాబు

  • మోదీ ప్రసంగంలో అన్నీ అబద్ధాలే
  • అవిశ్వాసానికి ఇన్ని విపక్ష పార్టీలు కలసిరావడం ఇదే మొదటిసారి
  • ఆదాయంలో వెనుకబడివున్న రాష్ట్రాన్ని ఆదుకునే బాధ్యత లేదా?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పన్నిన ట్రాప్ లో తాము పడ్డామని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడం పూర్తి అవాస్తవమని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. నిన్న రాత్రి 11.15 గంటల సమయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, నరేంద్ర మోదీ తన ప్రసంగంలో అన్నీ అబద్ధాలే చెప్పారని విమర్శించారు. ఓ పార్టీ అవిశ్వాసం పెడితే, ఇన్ని విపక్ష పార్టీలు కలసిరావడం ఇదే మొదటిసారని గుర్తు చేసిన ఆయన, తాము ఓడిపోయినా నైతిక విజయం తమదేనని అన్నారు.

 ప్రధాని స్థాయిలో ఉన్న మోదీ చులకనగా మాట్లాడటం బాధను కలిగించిందని, తాము వైసీపీ ఉచ్చులో పడ్డామనడం ఇంకా బాధను కలిగించిందని అన్నారు. దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల్లోకెల్లా ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడివుందని గుర్తు చేసిన ఆయన, రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాకు సమానంగా ప్యాకేజీని ఇస్తామంటేనే నాడు అంగీకరించామని, హోదాకు సమానమైన ప్యాకేజీ అందలేదు కాబట్టే ఇప్పుడు హోదాను కోరుతున్నామే తప్ప, తాము ఎవరి ఉచ్చులోనూ పడలేదని, తెలుగుదేశం పార్టీ ఆ స్థాయికి ఎన్నడూ చేరుకోబోదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

More Telugu News