congress: ‘కాంగ్రెస్’కు ఏ విషయంలోనూ విశ్వాసం లేదు: మోదీ

  • దేశానికి, ప్రపంచానికి మా ప్రభుత్వంపై విశ్వాసం ఉంది
  • సర్కార్ చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ విమర్శిస్తుంది
  • రాఫెల్ ఒప్పందం జరిగింది వ్యాపారుల మధ్య కాదు 

దేశానికి, ప్రపంచానికి, దిగ్గజ ఆర్థిక సంస్థలకు తమ ప్రభుత్వంపై విశ్వాసం ఉందని, ‘కాంగ్రెస్’కు మాత్రం ఏ విషయంలోనూ విశ్వాసం లేదని ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తూనే ఉందని, ఆర్బీఐ, ఎన్నికలు, ఈవీఎంలు.. ఏ విషయంలోనూ ఆ పార్టీకి విశ్వాసం లేదని విమర్శించారు. చివరకు, దేశ రక్షణకు సంబంధించిన విషయాల్లోనూ ఆటలాడుతున్నారని, అది సరికాదని హితవు పలికారు. సరిహద్దుల్లో జరిగిన సర్జికల్ స్ట్రయిక్స్ పై కూడా వ్యంగ్యం మాట్లాడతారా? అలా మాట్లాడటం సైన్యం ధైర్య, సాహసాలను కించపరిచే చర్య అని అన్నారు.

ఎటువంటి ఆధారాలు లేకుండా ఇష్టానుసారం ఆరోపణలు చేస్తున్నారని, రాఫెల్ ఒప్పందం రెండు దేశాల మధ్య జరిగిందని, ఇద్దరు వ్యాపారుల మధ్య కాదని కాంగ్రెస్ నేతలకు చురకలంటించారు. రాఫెల్ ఒప్పందం పూర్తి పారదర్శకతతో జరిగిందని అన్నారు. దేశంలో అస్థిరత సృష్టించేందుకే కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ఎంచుకుందని, ప్రజలు అందించిన స్పష్టమైన ఆధిక్యాన్ని అస్థిరపరిచేలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కుదిరితే సయోధ్య కోసం ప్రయత్నించడం లేకపోతే ప్రభుత్వాలను కూలదోయడమనేది కాంగ్రెస్ పార్టీ చాలా కాలం నుంచి అనుసరిస్తున్న విధానం అని ప్రధాని నిప్పులు చెరిగారు.

More Telugu News